Breaking News

రాష్ట్రంలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు చేరిన కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు : మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రౌడీల రాజ్యం నడుస్తోందని.. కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు పరాకాష్టకి చేరాయని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దుర్బుద్ధితో రాష్టంలో రాక్షస రాజ్యం నడుపుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమని మల్లాది విష్ణు అన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు. ప్రతీ అంశాన్ని గత ప్రభుత్వంతో ముడిపెడుతూ.. ప్రజలను గందరగోళపరుస్తున్నారని నిప్పులు చెరిగారు.

సీబీఐ ఎంక్వయిరీకి ఎందుకంత భయం
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ధర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ బాబు బీ టీం అని మల్లాది విష్ణు విమర్శించారు. ఇదంతా గత ప్రభుత్వాన్ని దోషిగా నిలిపే ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి.. ఎప్పుడు వెనక్కి పంపారో తేదీలతో సహా ప్రజలకు వైఎస్ జగన్ వివరించడం జరిగిందన్నారు. కల్తీ జరగలేదని ఈఓ స్పష్టంగా చెప్పటం జరిగిందన్నారు. తప్పు జరిగిందని ప్రభుత్వం భావిస్తే.. సీబీఐ ఎంక్వయిరీకి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను మేధావులు, విద్యావేత్తలు ఈ పాటికే గ్రహించారని చెప్పారు. న్యాయవ్యవస్థపై తమకి అచెంచల విశ్వాసం ఉందని.. అందుకే సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించినట్లు తెలిపారు.

ప్రజాప్రతినిధుల తీరు మారాలి
కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రౌడీలేనని.. రాష్ట్రంలో నడుస్తోంది ముమ్మాటికీ రౌడీ రాజ్యమేనని మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. పోలీసులు కూడా వీరికి వత్తాసు పలకటం బాధాకరమన్నారు. ఈక్రమంలో బాధితులకు ఎక్కడా న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు ఎమ్మెల్యే అరాచకాలే ఇందుకు నిదర్శనమన్నారు. మెడికల్ కాలేజ్ హెచ్ఓడి పై కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసి బూతులు తిడుతుంటే.. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు జనసేన అధినేత కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే అంబేద్కర్ బ్యానర్ ని కాళ్ళతో తొక్కి అవమానిస్తే.. మరో ఎమ్మెల్యే తనకో రెడ్ బుక్ ఉందంటూ ప్రజలను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో ఓ ప్రజాప్రతినిధి భర్త ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో చేసిన దౌర్జన్యాన్ని పత్రికల్లో చూశామన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంతృత్వంలో ఉన్నామా..? చివరకు ప్రశ్నించిన విలేకరులపై దాడులు, కిడ్నాప్ లు చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ ప్రభుత్వం పోలీసులను సైతం బెదరిస్తోందని.. తాడిపత్రిలో ఓ సీఐ ఇంటి ముందు ధర్నా చేయటం ఇందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో మంత్రులు సైతం అదే తీరున వ్యవహరిస్తున్నారని.. కాపు సామాజికవర్గానికి చెందిన యువతను కార్మికశాఖ మంత్రి కక్షతో పోలీస్ స్టేషన్ లో పెట్టించి కొట్టించిన ఘటన బాధించిందన్నారు. అధికారులకు సైతం ఈ ప్రభుత్వంలో రక్షణ కరువు అయిందని.. నంద్యాల మునిసిపల్ కమిషనర్ పై సాక్షాత్తూ ఆ జిల్లా మంత్రినే దౌర్జన్యం చేయటం బాధాకరమన్నారు.

వరద బాధితులపై లాఠీఛార్జా..?
పశ్చిమ నియోజకవర్గంలో ఎన్యుమరేషన్ జరగలేదని రోడ్డెక్కిన బాధితులపై ఈ ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించటం బాధాకరమని మల్లాది విష్ణు అన్నారు. సింగ్ నగర్ లో వరద బాధితులను స్థంభానికి కొట్టేసి కొట్టారని.. పైగా మక్కెలు విరగ్గొడతామని బెదరించటం హేయమన్నారు. టీడీపీ అనుకూల పత్రికల్లోనే ఈ వార్తలు వచ్చాయన్నారు. ప్రజలందరూ ఈ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని.. వారంతా మీ మక్కెలు విరిచి, ఎమ్మెల్యేల గర్వాన్ని అణిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే.. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

Check Also

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం

-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *