– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
– గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మ గాంధీ ప్రబోధించిన సమతావాదమే భారతదేశానికి రక్షణ కల్పిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అక్టోబరు 2వ తేది గాంధీ జయంతిని పుస్కరించుకుని సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఒన్‌టౌన్‌లోని గాంధీ పార్కులో సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మన దేశంలో అన్ని కులాలు, మతాలు సమైక్యంగా జీవించటానికి గాంధీజీ సూచించిన సమతావాదం సరైయిందన్నారు. స్వాతంత్య్ర వచ్చిన 70ఏళ్ల తరువాత స్వాతంత్రోద్యమంలో పాల్గొనని వారు, గాంధీజీ ఆశయాలను మంటగలిపిన వారు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వంటి మతోన్మాద శక్తులు అనేక మంది సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మం గురించి ఏ మాత్రం తెలియని కొందరు, తెలిసో తెలియకో కొంత మంది సినీనటులు కూడా ప్రచారం చేస్తున్నారన్నారు. అణగారిన వర్గాలను, మహిళలను కించపర్చే రీతిగా సనాతన ధర్మం ఉంటుందన్నారు. మన దేశంలో అనేక కులాలు, మతాలు, వివిధ భాషలు మాట్టాడే వారు కలిసి ఉండటానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, గాంధీజీ సమతావాదమే కారణం అన్నారు. సనాతన ధర్మం దేశానికి అరిష్టం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, లౌకికవాదాన్ని రక్షించటానికి గాంధీ చూపిన మార్గం అనుసరణీయం అన్నారు. ప్రపంచంలో అనేక మంది మహాత్ములు ఉన్నా‘నా జీవితమే నా సందేశం’ అని ధైర్యంగా చెప్పిన మహనీయుడు గాంధీజీ మాత్రమే అన్నారు. గాంధీజీ స్పూర్తితో దేశాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని కాపాడటం కోసం ప్రజలు నడుం కట్టాలని కమ్యూనిస్టు పార్టీ తరపున రామకృష్ణ పిలుపునిచ్చారు. ముందుగా పార్కులోని మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడియ్య, కొట్టు రమణారావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, కోశాధికారి ఎం.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.