Breaking News

కూటమి ప్రభుత్వంలో ఏం కొనలేం.. తినలేమంటున్న నిరుపేదలు

-నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న చంద్రబాబు సర్కార్: మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డివిరుస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విమర్శించారు. గడిచిన 4 నెలలలో నిత్యావసరాలు మొదలుకొని ఆహారధాన్యాలు, అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. అవసరమైన పప్పు, బియ్యం, నూనె, ఉల్లి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని.. ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, వరదలతో ఆర్థికంగా చతికిలపడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. కానీ ప్రభుత్వ చర్యలతో సామాన్యుడి జీవనం అగమ్యగోచరంగా మారిందన్నారు.

గత 4 నెలల్లో నిత్యావసరాల ధరల పెరుగుదల

మే (రూ.లో) సెప్టెంబర్ (రూ.లో)
పామాయిల్ లీ. 80-85 115-120
సన్ ఫ్లవర్ ఆయిల్ లీ. 105 130
శనగ నూనె లీ. 130 160
కందిపప్పు కేజీ 150 180
వేరుశనగ కేజీ 120 140
మినుములు కేజీ 120 140
ఉల్లిపాయలు కేజీ 30 80
టమాటా కేజీ 30 60
బంగాళదుంప 25 50

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల కాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకం అమలుకాకపోగా.. ధరల బాదుడు పథకం మాత్రం దిగ్విజయంగా అమలవుతోందని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. జూలై 2 న నిత్యావసరాల ధరల పెరుగుదలపై వ్యవసాయశాఖ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఏం సాధించారని ప్రశ్నించారు. అదే వైసీపీ ప్రభుత్వంలో ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేవని.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుపేదల జీవనం దినదినగండంగా మారిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రెండంకెల్లో ఉన్న సరుకుల ధరలు.. ఈ ప్రభుత్వం వచ్చాక మూడంకెలకు చేరాయని ఆరోపించారు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలవారీ ఖర్చు అదనంగా రూ.2 వేలు పెరగడంతో సామాన్యుల గుండె బరువెక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో.. వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీసం పండుగ పూట కూడా రెండు పూటలా తినే పరిస్థితి లేకుండా చేశారని ధ్వజమెత్తారు. తూ.గో. జిల్లా నిడదవోలు ఎన్నికల ప్రచార సభలో (ఏప్రిల్ 10, 2024) పవన్ కళ్యాణ్, పురందేశ్వరితో కలిసి ఒకే వేదికపై మాట్లాడుతూ.. నిత్యావసరాలు ధరలు తగ్గిస్తామంటూ ఆనాడు బాబు మాట్లాడిన మాటలు ఏమయ్యాయని మల్లాది విష్ణు ప్రశ్నించారు. తీరా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్నది వేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్యుడి కొనుగోలు శక్తి ఉండటం లేదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటికైనా పెరుగుతున్న ధరలను నియంత్రించాలని.. లేకుంటే సామాన్యుడి ఆగ్రహ జ్వాలలకు ఈ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *