విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ మహాత్ముడు చూపిన మార్గం నేటితరానికి అనుసరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జాతిపిత మహాత్మగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆ మహనీయుల చిత్రపటాలకు బుధవారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సత్యం, అహింసలను ఆయుధాలుగా చేసుకుని, శాంతియుతంగా పోరాటం చేసి దేశానికి గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించి పెట్టారని తెలిపారు. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా.. ఇలా స్వాతంత్య్ర సముపార్జనకు ఆయన పిలుపునిచ్చిన ప్రతి పోరాటంలోనూ ప్రజలు భాగస్వాములయ్యారన్నారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే దేశ స్వాతంత్య్ర సాధనలో లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కృషి మరువలేనిదని మల్లాది విష్ణు అన్నారు. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి, నిజాయితీ ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించారన్నారు. జవానులను, రైతులను సమానంగా భావించి.. జై జవాన్- జై కిసాన్ నినాదం తీసుకువచ్చారన్నారు. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని ముందుకు నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి అని కీర్తించారు. ఆయన తన జీవితమంతా నిజాయితీగా బతికారని.. చనిపోయేవరకు సొంత ఇంటిని నిర్మించుకోలేకపోయారని చెప్పారు. ఆ మహనీయుల ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News