-సింగ్ నగర్ లో పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ లో గత డంపింగ్ యార్డు ప్రాంతంలో 17 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి పనులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సింగ్ నగర్ పర్యటనలో భాగంగా పార్క్ అభివృద్ధి పనులను, ఇళ్ల కాలనీని కలెక్టరు జె.నివాస్, మున్సిపల్ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్ లో చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణాలను శరవేగంతో పూర్తి చేయాలన్నారు. అడవి ఒకటి, రెండు క్రింద అభివృద్ధి చేస్తున్న ప్రాంతంలో మొక్కలు నాటడం, నర్సరీ పనులు పూర్తి అయ్యాయన్నారు. అయితే పార్క్ లో జిమ్, స్పోర్ట్స్ ఏరియా, అమ్యూజ్ మెంట్, నాలుగు వాకింగ్ ట్రాక్స్, తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతరం కృష్ణలంక వద్ద కృష్ణానదీ వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం మూలంగా నిర్వాసితులు అయిన 524 కుటుంబాలకు సింగ్ నగర్ లో కల్పించిన గృహవసతిని ఆయన పరిశీలించారు. ఇంతవరకూ 75 కుటుంబాలు ఇక్కడ నివాసంకు రాగా వారితో కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీ, శానిటేషన్ కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు శుక్రవారం విద్యుత్తుశాఖ సిబ్బందిని పంపుతామని ఆయన చెప్పారు. ఈసందర్భంగా ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలను పరిశీలించి ఇంకా ఏమైనా అవసరత ఉన్నదో ఆయన నివాసితులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరు వెంట వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్, సిఇ యం. ప్రభాకరరావు, నగరపాలక సంస్థ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.