-రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ కాలేజీలు
-యువతలో నైపుణ్యాలు పెంచడంతోపాటు ఉద్యోగాలు పొందేలా శిక్షణ : సీఎం జగన్
పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావడం కోసం అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం పులివెందులసహా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గురువారం పులివెందులలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి.. వారిలో స్కిల్స్ ను పెంపొందించేందుకు రూ. 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 25 స్కిల్ కాలేజీలు ఇలాంటివి రాబోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు పులివెందులలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) లోని హాస్టల్ భవనం సమీపంలో ఈ స్కిల్ ట్రైనింగ్ అకడామీ ఏర్పాటుకోసం ఇప్పటికే 7 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. ఈ స్కిల్ అకాడమీలో పులివెందుల పరిసర ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాలు పెంచడంతోపాటు ఉపాధి కల్పించడం కోసం అధునాతన ఐటి శిక్షణా కార్యక్రమాలతోపాటు సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ పరిశ్రమ వంటి ప్రధాన రంగాలలో అధునాతన నైపుణ్య శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఉండే యువతకు పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడంతోపాటు.. అందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజక వర్గాల్లోనూ స్కిల్ కాలేజీలకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేసింది. స్కిల్ కాలేజీల్లో హైఎండ్ స్కిల్స్ పై శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు స్థానికంగానే 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు కొత్త పరిశ్రమలను ఆకర్శించడం జరుగుతుంది.
ఈ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ఐటి, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి బంగారరాజు పాల్గొన్నారు.