మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నూతనంగా నిర్మించనున్న 4 వరుసల తూర్పు బైపాస్ రహదారి వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్ హెచ్ ఎ ఐ)ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో చైతన్య ప్రాజెక్ట్ కన్సల్టెంట్ మురళి నూతనంగా నిర్మించనున్న తూర్పు బైపాస్ రహదారి సమగ్ర ప్రాజెక్టు నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటాదారులకు వివరించారు.
తొలుత ఎన్ హెచ్ ఎ ఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగరంలో రాకపోకల రద్దీ రానురాను పెరుగుతున్న దృష్ట్యా ఆ పరిస్థితులను నివారించడానికి కొత్తగా 4 వరుసల తూర్పు బైపాస్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రూపకల్పన జరిగిందన్నారు. కృష్ణాజిల్లా లోని ఎన్ హెచ్ 16 ఉంగుటూరు మండలం పోట్టిపాడు నుండి ప్రారంభమై గుంటూరు జిల్లా చిన్న కాకాని లోని ఖాజా గ్రామం వరకు 44 కిలోమీటర్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఇందులో కృష్ణా జిల్లాలో 26 కిలోమీటర్లు ఉండగా గుంటూరు జిల్లాలో 18 కిలోమీటర్ల రహదారి ఉంటుందన్నారు.
ఈ రహదారి నిర్మాణానికి 2024-25 వార్షిక ప్రణాళికలో 2,716 కోట్ల రూపాయలను హైవే పనుల కింద కేటాయించడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం మార్చిలోగా భూసేకరణ పూర్తి చేసుకుని టెండర్లు పనులు పూర్తిచేసుకుని రహదారి నిర్మాణం పనులు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు.
కన్సల్టెంట్ మురళి మాట్లాడుతూ బైపాస్ రహదారి నిర్మాణానికి మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అందులో రెండవ ప్రతిపాదన అన్ని విధాల అనుకూలంగా ఉందన్నారు. ఆ ప్రతిపాదన ప్రకారం రహదారి నిర్మాణం వలన విమానాశ్రయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, మచిలీపట్నం ఓడరేవుకు దగ్గరగా అనుసంధానమై ఉంటుందని, అలైన్మెంట్ దారిలో వచ్చే భూములు తక్కువ ధరకే భూసేకరణకు లభిస్తాయని, 8 పెద్ద వంతెనలు నిర్మించాల్సి ఉంటుందని, అందులో కృష్ణా నది దాటేందుకు 3.35 కిలోమీటర్ల పెద్ద్ వంతెన నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఈ రహదారి మార్గంలో అటవీ భూములు గానీ, సెల్ టవర్లు గాని,స్మశానవాటికలు గాని, మసీదులు గాని, కుంటలు గానీ లేవని కేవలం వంట పొలాలు మాత్రమే వస్తాయన్నారు. రహదారి నిర్మాణానికి 291 ఎకరాలు భూసేకరణ కింద తీసుకోవలసి ఉంటుందన్నారు. ఈ రహదారి ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామం నుండి మొదలై, గన్నవరం, కంకిపాడు, పెనమలూరు మండలంలోని గోసాల, వణుకూరు గ్రామాల మీదుగా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలంలో ప్రవేశించి మంగళగిరి మండలంలోని చిన్నకాకానీ వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్ లో కలుసుకుంటుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైతే ఈ రహదారి ప్రతిపాదనలను న్యూఢిల్లీలోని రహదారులు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు ఆమోదం కోసం పంపడం జరుగుతుందన్నారు.
ఈ రహదారి నిర్మాణానికి తాత్కాలిక అంచనాల ప్రకారం భూసేకరణ ఇతరత్రా కలుపుకొని 4596.29 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కన్సల్టెంట్ వివరించారు. ఈ సమావేశంలో పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, గుడివాడ ఉయ్యూరు ఆర్డిఓలు బాలసుబ్రమణ్యం, డి సంపత్ హేళ షారూన్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, సర్వే భూ రికార్డుల ఏడి జోషిలా,సిపిడిసిఎల్ ఎస్.ఈ. సత్యానందం తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.