-గ్రామపంచాయతీల్లో నూరు శాతం పన్నుల వసూళ్లు చేయాలి
-జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీ రాజ్ వ్యవస్థను పునరుద్ధరణ ( రివైవల్) చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం PR ONE – Visible assets అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఈ వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రామపంచాయతీల్లో చేపట్టవలసిన పనులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందన్నారు. మండల పరిషత్, గ్రామపంచాయతీలు స్థానిక సంస్థలు మాత్రమే కాదు, ప్రత్యేకమైన ప్రభుత్వాలు, స్థానిక వనరులు వాడుకుంటూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అన్నారు. గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభలలో గ్రామానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి జాబితా రూపొందించారని, పి ఆర్ ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలలో గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా చేపట్టాలన్నారు. అభివృద్ధి చేసిన పనులు ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలన్నారు.
పంచాయతీలకు ఉన్న ఆదాయంలో ఆస్తి పన్ను ప్రధానమైనది, ఉన్న వనరులను బలోపేతం చేయాలని, ఏ ప్రాపర్టీ అసెస్మెంట్ చేయకుండా ఉండకూడదన్నారు. పన్నుల వసూళ్లు కరెక్ట్ గా చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. నూరు శాతం పన్నుల వసూలు మన బాధ్యత అన్నారు. టాప్ డిఫాల్టర్స్ జాబితా తయారు చేసుకుని, అత్యధిక బకాయిలు ఉన్న వారి నుండి పన్నుల వసూళ్లకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. అనవసరంగా బకాయిలు ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పన్నుల అసెస్మెంట్ పై రాండమ్ చెక్ ఉంటుందన్నారు. మున్సిపాలిటీలలో కంప్యూటర్ ఆటోమేటిక్‌గా పెనాల్టీ విధింపు వ్యవస్థ ఉంటుందని, అందువల్ల స్వచ్ఛందంగా వచ్చి పన్నులు కడతారని అన్నారు. గ్రామాల్లో కూడా ఈ విధానం అమలులోకి తేవాలని ప్రభుత్వం అనుకుంటున్నదని అన్నారు. నూరు శాతం పన్ను వసూలు అయితేనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందన్నారు. పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు తదితరాలు పోగా, మిగతా డబ్బుతో కొత్త పనులు చేపట్టడానికి విజిబుల్ ఎసెట్స్ ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.
ఈనెల 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహించి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పరిపాలన ఆమోదం పొందిన పనులకు భూమి పూజ ద్వారా గ్రౌండ్ చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమం అమలుకు మొబైల్ యాప్ కూడా ప్రభుత్వం ఇస్తున్నదని, ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. చేపట్టిన పనులు నాణ్యత పాటించాలని, తూతూ మంత్రంగా చేస్తే సహించమని అన్నారు. జిల్లాలో ఎక్కువగా సిసి రోడ్లు పనులు ఉన్నాయని, సిసి రోడ్లు ఎక్కువ కాలం మన్నాలంటే క్యూరింగ్ కరెక్ట్ గా చేయాలని, ఎన్ని రోజులు క్యూరింగ్ చేశారో ఆ రోడ్డు లో ప్రజల సంతకాలు తీసుకోవాలని, ఎన్ని రోజులు క్యూరింగ్ చేసారో స్వయంగా తనిఖీ చేసి ఆరా తీస్తామని అన్నారు.
స్వచ్ఛత ఈ సేవ లో భాగంగా సఫాయి మిత్రలకు వైద్య పరీక్షలు నిర్వహించామని ప్రతి శానిటేషన్ వర్కర్ మెడికల్ రిపోర్టు పంచాయతీ సెక్రెటరీ వద్ద డిఎల్పిఓల వద్ద ఉండాలని, మెడికల్ టెస్ట్ లు చేసిన వారిని డాక్టర్‌కు చూపించాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీలు గడువు దాటే వరకు వేచి ఉండి, హడావుడిగా ఏదో ఒకటి ఎండార్స్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేయవద్దని, ఏ రోజు వచ్చిన అర్జీ ఆరోజే చూసుకుంటే సమస్య ఉండదని, రీ ఓపెన్ కు తావు ఇవ్వరాదని, అర్జీదారులతో ఫోన్లో మాట్లాడాలని, వారి సమస్యలపై అధికారులు స్పందిస్తున్నారనే మెసేజ్ వెళ్లాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీ నుండి 3 శాతం స్పోర్ట్స్ సెస్ డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో డిపిఓ జే అరుణ, జడ్పిసిఈఓ కే కన్నమ నాయుడు, ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.