మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు బజార్లలో తక్కువ ధరకు అందిస్తున్న టమాటాలు, వంట నూనెలకు వినియోగదారుల నుండి స్పందన బాగుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి అన్నారు. డీఎస్ఓ గురువారం స్థానిక రైతు బజార్ సందర్శించి టమాట, ఆయిల్ విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ నేటి నుండి రైతు బజార్లలో కిలో టమాట 50 రూపాయలు, లీటర్ పామాయిల్ 114 రూపాయలు, లీటరు సన్ఫ్లవర్ ఆయిల్ 124 రూపాయలకే ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల నుండి స్పందన బాగుందన్నారు. ఈ సౌకర్యం వినియోగించుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున బృందావనపుర హోల్సేల్ మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీ జల్లూరి గోపి, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
వినియోగదారుల అభిప్రాయాలు
స్థానిక జవారుపేటకు చెందిన వినియోగదారుడు ఎండి. సుభాని తన అభిప్రాయం తెలియజేస్తూ బహిరంగ మార్కెట్లో కిలో 80 రూపాయల ధర పలుకుతున్న టమాటాలు రైతు బజార్ లో 50 రూపాయలకే కొనుగోలు చేశానని, ప్రభుత్వం కూరగాయల ధరలు తగ్గించి అమ్మడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు.
పరాస్ పేటకు చెందిన మహిళ వినియోగదారు పెద్దిబోయిన సీతారామలక్ష్మి రైతు బజార్లో కిలో టమాట 50 రూపాయలకి కొనుగోలు చేశానని, బయట వంద రూపాయల వరకు ధర పలుకున్నదని, సగం ధరకే ప్రభుత్వం టమాటాలు అందించడం ముఖ్యంగా మహిళలకు సంతోషకరమైన విషయమని అన్నారు.
స్థానిక సుకర్లబాధకు చెందిన వినియోగదారుడు v. శ్రీనివాసరావు ఈరోజు రైతు బజార్ లో సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు 124 రూపాయలకే కొనుగోలు చేశానని, ఇదే బయట మార్కెట్లో 132 రూపాయలకు పైగా ధర ఉందని, ప్రభుత్వం పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ బయట మార్కెట్ కంటే తగ్గింపు ధరలకు అందించడం మంచిదేనని, ఉల్లిపాయలు కూడా తగ్గింపు ధరలకు అందించాలని కోరారు.