-నీతి ఆయోగ్ బృందం ప్రశం
ఆత్కూరు (ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతుల జీవనోపాధిని మార్చడానికి ఆర్ వై ఎస్ఎస్ చేస్తున్న కృషిని, సామర్థ్యాన్ని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. రాబోయే రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ విజయాన్ని గమనించడం ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలపై సంపూర్ణ అవగాహన కోసం నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన బృందం గురువారం ఏలూరు, కృష్ణా జిల్లాలలో పర్యటించింది. తొలుత కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం, ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ శిక్షణ భవనంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ కుమార్ బృంద సభ్యులకు “ఏపీసీఎన్ఎఫ్” గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరిస్తూ ప్రకృతి వ్యవసాయ ఆవశ్యకత, సార్వత్రిక సూత్రాలు, అమలుతీరు, లక్ష్యాలు, మోడల్స్ తదితర అంశాలను తెలియజేశారు.
ఈ సంధర్భంగా టి విజయ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2016వ సంవత్సరంలో 40 వేల మంది రైతులతో మొదలైన ప్రకృతి వ్యవసాయం ఇప్పటికీ 10 లక్షల మంది రైతుల వరకు చేరుకుందని, ప్రభుత్వాలతో పాటు అజీమ్ ప్రేమజీ, కో ఇంపాక్ట్, కేఎఫ్ డబ్ల్యూ తదితర సంస్థల మద్దతుతో కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు చెప్పారు. 2018వ సంవత్సరంలో 11 మందితో మొదలైన పిఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) ప్రస్తుతం వేల ఎకరాలకు విస్తరించిందని అన్నారు. ఏ గ్రేడ్, ఎటీఎం మోడల్స్ ద్వారా అంతర పంటలను ప్రోత్సహిస్తూ ప్రకృతి వ్యవసాయంలో రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సంధర్భంగా బృంద సభ్యుల్లో ఒకరైన వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ 365 రోజుల గ్రీన్ కవర్, ఆదాయ ఉత్పత్తి, కార్మిక అవసరాలు, దిగుబడి వంటి క్లిష్టమైన అంశాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను బలోపేతం చేయడానికి జీవామృతం, ఘనజీవామృతం వంటి జీవ ఉద్దీపనలపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐ కార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేష్ కుమార్ చౌదరి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) పద్ధతిపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరవు ప్రాంతంగా పేరుబడ్డ అనంతపురంలో ఈ విధానం ఆరంభించడం విశేషం అన్నారు. ఆ ఆవిష్కరణలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులను అనుసంధానం చేసేందుకు మరిన్ని పరిశోధనలను ఆయన ప్రోత్సహించారు.
ఐ కార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (అగ్రోనమీ, అగ్రోఫారెస్ట్రీ & క్లైమేట్ చేంజ్) డాక్టర్ రాజ్బీర్ సింగ్ ప్రకృతి వ్యవసాయంలో సాధిస్తున్న విజయాలను ఆమోదిస్తూ రాష్ట్రంలో గమనించిన పంటల వైవిధ్యతను ప్రశంసించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ రైతులతో సంభాషించడానికి ఆసక్తిని ప్రదర్శిస్తూ సైన్స్, ప్రకృతి వ్యవసాయం ఏకీకరణ గురించి, ముఖ్యంగా తెగుళ్ల నిర్వహణలో పంటల వైవిధ్యం పాత్ర గురించి మరింత తెలుసుకోవడానికి తన ఆసక్తిని కనబరిచారు.
నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్ ఆహార భద్రత ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ బొటానికల్ ఎక్స్ట్రాక్ట్తో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఎరువుల పరీక్షలను మెరుగుపరచడానికి రాష్ట్రాన్ని ప్రోత్సహించడం, సరైన మోతాదు పరీక్షను నిర్ధారించడం గురించి చర్చించారు. ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మి దేవి మాట్లాడుతూ స్థిరమైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింత పరిశోధించడం, విద్యాపరమైన ప్రయత్నాల ద్వారా వాటి అభివృద్ధికి తోడ్పడవలసిన అవసరాన్ని తెలియజేశారు. నీతి ఆయోగ్ వ్యవసాయం, అనుబంధ రంగాల నిపుణులు పరేమల్ బనాఫర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న రైతులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, విస్తరణపై ప్రకృతి వ్యవసాయ రైతులకు మరింత మద్దతు అవసరం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానవన, మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శి బాబు ఏ, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ డిల్లీరావు, రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ఏపీసీఎన్ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ పార్థసారథి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, రైతు సాధికార సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి బి. రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శామ్యూల్ ఆనంద్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు, డాక్టర్ డీవీ రాయుడు, గోపీచంద్, జాకీర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News