-విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేయాలి
-జిల్లా కలెక్టర్
కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల అవసరాలకు అనుగుణంగా విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేసే విధంగా పనులు చేపట్టాలని, ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలు, పిఆర్ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, డ్వామా ఏపీడిలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గురువారం కంకిపాడులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో Visible assets create in PR ONE app అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఈ వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో పనులు గుర్తించడంలో మన ఆలోచనలు విస్తృతం కావాలని, క్రియేటివ్ గా ఉండాలని సూచించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలలో గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా చేపట్టాలన్నారు. అభివృద్ధి చేసిన పనులు ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలన్నారు. గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, నూరు శాతం పన్ను వసూళ్లు జరగాలని అన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి ఆస్తి పన్ను మదింపు చేయాలని, దీనిపై ర్యాండమ్ చెక్ చేయిస్తానని అన్నారు.
ఏపీవో, ఏఈఆర్డబ్ల్యూఎస్, ఏఈపిఆర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు కలసి టీమ్ గా పనిచేయాలని, ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈనెల 14 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించి పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పరిపాలన ఆమోదం పొందిన పనులకు భూమి పూజ ద్వారా గ్రౌండ్ చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం అన్నారు. ప్రతి పనిని నాణ్యతతో చేపట్టాలన్నారు. చేపట్టే పనులు సమాచారంతో సిటిజన్ నాలెడ్జ్ బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. సిసి రోడ్లు ఎక్కువ కాలం మన్నాలంటే క్యూరింగ్ కరెక్ట్ గా చేయాలని, ఎన్ని రోజులు క్యూరింగ్ చేశారో స్వయంగా తనిఖీ చేసి ఆరా తీస్తామని అన్నారు. స్వచ్ఛతా హీ సేవ లో భాగంగా సఫాయి మిత్రలకు నిర్వహించిన వైద్య పరీక్షల మెడికల్ రిపోర్టు డిఎల్పిఓల వద్ద ఉండాలని, మెడికల్ టెస్ట్ లు చేసిన వారిని డాక్టర్కు చూపించాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం లో వచ్చిన అర్జీలు సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అర్జీ వచ్చిన వెంటనే అర్జీదారునితో ఫోన్లో మాట్లాడి సమస్య తెలుసుకోవాలని, తగిన విచారణ జరపాలని, పరిష్కార చర్యలు అర్జీదారులకు తెలియజేయాలని, తద్వారా రీ ఓపెన్ సమస్య ఉండదని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీ వసూలైన పన్నుల నుండి 3 శాతం స్పోర్ట్స్ సెస్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి డిపాజిట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డిపిఓ జే అరుణ, జడ్పిసిఈఓ కే కన్నమ నాయుడు, జడ్పీ డిప్యూటీ సీఈవో ఆనందకుమార్, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పిఆర్ ఏఈలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News