-హోం మంత్రి వంగలపూడి అనిత
-నిందితులకు త్వరగా శిక్షపడేలా చూడాలని హోం మంత్రిని కోరిన బాధిత కుటుంబం, జై గౌడ సేన నాయకులు
-కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి వేగంగా దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించిన హోంమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ హయాంలో దారుణహత్యకు గురైన మైనర్ బాలుడు ఉప్పాల అమర్ నాథ్ కుటుంబానికి న్యాయం చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తన సోదరిని వేధించవద్దని వారించిన కారణంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలేనికి చెందిన 16 ఏళ్ల తమ చిన్నారి అమర్ నాథ్ ని గతేడాది పెట్రోల్ పోసి నిప్పంటించారంటూ బాధిత కుటుంబం, గౌడ సేన నాయకులు హోం మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి వేగంగా దర్యాప్తు చేయాలని నిందితులకు శిక్షపడేలా చూడాలని హోం మంత్రికి వారు శనివారం సచివాలయంలో వినతి పత్రం సమర్పించారు. హత్య అనంతరం నిందితులకు బెయిల్ రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో మృతుడి తల్లి మాధవిని బెయిల్ పై వచ్చి బెదిరించిన పరిణామాలను వారు హోం మంత్రికి వివరించారు. తమ ప్రాణాలకు సైతం ముప్పు ఉందని వాపోయారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం జయహో బీసీ సభల్లో నారా లోకేష్ గారు తన ప్రసంగంలో న్యాయం చేస్తామని ప్రకటించిన విషయాన్ని గౌడ సంఘం నాయకులు ప్రస్తావించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు అమర్ నాథ్ కుటుంబాన్ని వచ్చి పరామర్శించి..అండగా నిలబడతామన్న విషయాన్ని హోం మంత్రి అనితగారికి తెలియపరచారు. వెంటనే స్పందించిన హోం మంత్రి అనితగారు అమర్ నాథ్ హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి వేగంగా దర్యాప్తు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని ఆదేశించారు. దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితులకు చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. హోంమంత్రికి వినతి పత్రం సమర్పించిన వారిలో బాధిత కుటుంబ సభ్యులు సహా జై గౌడ సేన జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండలు గౌడ్ ఉన్నారు.