-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విపత్తు నిర్వహణా దళాలు, ఐఎండీ బృందాలు, రెస్క్యూ సహాయక సిబ్బందితో పాటు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. పునరావాస కేంద్రాలు, షెల్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ లను సిద్ధం చేసి.. ఎంత వర్షపాతం నమోదవుతుందో గంటగంటకు పర్యవేక్షించాలన్నారు. విజయవాడ వరద సహాయక చర్యలలో అశ్రద్ధ వహించినట్లు కాకుండా.. లోతట్టు ప్రాంతాలలో నీటిని తోడేందుకు కావలసిన మోటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని.. అవసరమైన యంత్రాంగం, పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రజలందరూ స్వీయరక్షణ పాటించాలని తెలిపారు.