Breaking News

30 కోట్లతో దశలవారీగా అన్ని రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు నియోజకవర్గంలో 30 కోట్లతో దశలవారీగా అన్ని రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ తాళ్లపాలెం బీచ్ వద్ద మంగళవారం మంత్రి ఉపాధి హామీ పథకం కింద 38 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్ నిధులతో సిసి అప్రోచ్ రోడ్డు (రింగ్ రోడ్డు) నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్ఆర్ఈజీఎస్ క్రింద రాష్ట్రంలో 4500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి శ్రీకారం చుట్టారన్నారు. గత ఆగస్టు నెల 23వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన సందర్భంలో ఆయా గ్రామపంచాయతీలలో అవసరమైన పనులు గుర్తించినట్లు తెలిపారు. ఈ పనులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాలో కంకిపాడులో ప్రారంభించారని అన్నారు. ఈ పనులన్నీ వచ్చే సంక్రాంతి లోగా పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో 30 కోట్లతో అన్ని రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి, డ్రైను, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అన్నారు.

తాళ్లపాలెం బీచ్ వద్ద గతంలో ప్రారంభించిన రోడ్లు అసంపూర్తిగా వదిలేశారని, దీనిని ఇప్పుడు 500 మీటర్లు పొడవు, మూడున్నర మీటర్లు వెడల్పుతో సీసీ రోడ్డుగా సెంటర్ డివైడర్ తో నిర్మిస్తున్నట్లు తెలిపారు. గతంలో మూడున్నర కోట్లతో బీచ్ వద్ద మెరక పనులు చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా బీచ్ ను ఎలాంటి అభివృద్ధి లేకుండా మూసివేసారని అన్నారు. తిరిగి బీచ్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేసి, ఉపాధి, ఆదాయ వనరులు లభించేలా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టామన్నారు. స్థానిక నాయకులు బండి రామకృష్ణ మాట్లాడుతూ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా బీచ్ వద్ద రాబోయే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబల్ రోడ్డు గా వేయడానికి ఈరోజు మంత్రి శంకుస్థాపన చేశారని తెలిపారు. ప్రజలు శ్రమదానం చేయాలని సూచించారు

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఏఎంసీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కుంచె నాని, తలారి సోమశేఖర్, లంకే శేషగిరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

-అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం -లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి -యువగళం హామీ మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *