మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 19 వ తేదీన మొవ్వలో నిర్వహించనున్న కొత్త తరహా న్యాయ సేవల శిబిరాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవల శిబిరం ఏర్పాట్లపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు మండల కేంద్రమైన మొవ్వలోని మండవ జానకి రామయ్య, సులోచన క్షేత్రయ్య కళ్యాణ మండపంలో కొత్త మాడ్యూల్ న్యాయ సేవల శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేసి అవగాహన కలిగించాలన్నారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ శాఖ వారికి సంబంధించిన ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసి కరపత్రాలు తదితర పుస్తక ప్రచురణలతో ప్రజలను చైతన్యపరచి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా అధికారులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం, సలహాలు అందించేందుకు 15100 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చిందని అవసరమైన వారు సంప్రదించవచ్చున్నారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ గురించి అందరికీ తెలిసే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలాగా ప్రదర్శించాలన్నారు. అలాగే న్యాయబంధు పేరుతో ఒక యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా న్యాయ సహాయం పొందగోరువారు వారి వివరాలతో అందులో పోస్ట్ చేస్తే 4 రోజుల్లోగా న్యాయవాదులు వారిని సంప్రదించి సమాధానం చెబుతారన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు మాట్లాడుతూ న్యాయ శిబిరానికి పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, డ్వాక్రా మహిళలు,ఉపాధి హామీ కూలీలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొనేలా చూడాలని, వచ్చిన వారికి మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉయ్యూరు ఆర్డిఓ అధికారులందరినీ సమన్వయ పరుచుకుని కార్యక్రమం సజావుగా జరిగేలా పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. శిబిరం ఏర్పాటు చేసే ప్రాంతం, పరిసర ప్రాంతంలో చెత్తాచెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. శిబిరం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డిఓ షారోన్, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, ఎల్ డి ఎం టీ ఎస్ జయవర్ధన్, వృద్దులు దివ్యాంగుల శాఖ ఏడి కామరాజు, బిసి సంక్షేమ అధికారి రమేష్, బీసీ కార్పొరేషన్ ఈడీ శంకర్రావు, అదనపు డీఎంహెచ్ఓ వెంకట్రావు, కలెక్టరేట్ డిటి నాంచారమ్మ, మొవ్వ డి టి రఘురాం తదితర అధికారులు పాల్గొన్నారు.