-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ తయారీ నేపథ్యంలో జిల్లా గ్రోత్ రేట్ 15 శాతం పైన ఉండేలా గ్రోత్ ఇంజన్లతో ఆచరణాత్మక జిల్లా ప్రణాళికలు తయారీలో ఐఐటీ తిరుపతి మరియు పలువురు సబ్జెక్ట్ నిష్ణాతుల సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగ పడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నుండి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మరియు సబ్జెక్ట్ నిపుణులతో స్వర్ణాంధ్ర 2047 తిరుపతి జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీ, పలు అంశాలపై వర్చువల్ విధానంలో కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు. జిల్లా గ్రోత్ రేట్ 15 శాతానికి తగ్గకుండా మన జిల్లా పొటెన్షియల్ గ్రోత్ రేట్ ఉండేలా పలు అంశాలపైన పర్యాటక మరియు ఆతిథ్య రంగం, విద్యా, పరిశ్రమలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ప్రమోషన్, ఎలక్ట్రానిక్ హబ్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో ఆచరణాత్మక జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారీకి వారి సూచనలు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పలు కేటగిరీలకు చెందిన ప్రజానీకం స్వర్ణాంధ్ర 2047 సంబంధించి సుమారు 70 వేలకు పైగా ఫీడ్బ్యాక్ పంపడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రణాళికా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్రశేఖర్ పాల్గొన్నారు.