-అందరి మంచి కోరే అజాతశత్రువు మార్తి శ్రీ మహావిష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మార్తి శ్రీ మహావిష్ణు మరణంతో ఒక మంచి ఆప్తుడుని కోల్పోయానని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్ ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు కీ.శే. మార్తి శ్రీ మహావిష్ణు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మార్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ మార్తి శ్రీ మహావిష్ణు మృదుస్వభావి, స్నేహశీలి అని పేర్కొన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం అందించడంలో ముందు ఉండేవారన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం, 30వ డివిజన్ అభివృద్ధి కొరకు చివరి నిమిషం వరకు పాటుపడ్డారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారన్నారు. కరోనా కష్టకాలంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు అందుకున్నారన్నారు. మరీముఖ్యంగా 30వ డివిజన్ వాసులకు, డివిజన్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీచేయవలసిన సమయంలో మృత్యువు కరోనా రూపంలో కబలించడం దురదృష్టకరమన్నారు. భౌతికంగా ఆయన మనకు దూరమైనప్పటికీ ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మార్తి సుధారాణి, మార్తి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు.