-రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రాజధాని అమరావతిలో పలు అభివృద్ది పనులకు సంబందించిన అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు మినహా మిగిలిన అన్ని పనులకు టెండర్లను డిశంబరు మాసాంతానికల్లా పిలువనున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ పనులు అన్నీ ఏడాది నుండి రెండున్నర్రేళ్లలోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 38 వ సీఆర్డిఏ సమావేశం నేడు సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్దికి సంబందించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి రాజదాని ప్రాంతంలో దాదాపు 3,600 అపార్టుమెంట్లను కట్టడం జరిగిందన్నారు. వాటిలో శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు ఐ.ఏ.ఎస్. అధికారులు నివాసానికి సంబందించి 432 ప్లాట్లతో కూడిన 18 టవర్ల నిర్మాణాలను గతంలో చేపట్టి దాదాపు పూర్తి చేయడమైందన్నారు. అయితే సివరేజ్ ప్లాంట్, త్రాగునీటి సరఫరా, క్లబ్ హౌస్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని రూ.524 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు నేటి సమావేశంలో క్లియరెన్సు ఇచ్చిన నేపథ్యంలో, రెండు మూడు రోజుల్లో వాటిని సంబందించిన టెండర్లను పిలిచి 20 రోజుల్లో ఈ పనులను ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సీఆర్డిఏ కార్యాలయం కోసం గతంలో తమ ప్రభుత్వం జి+7 భవన నిర్మాణాన్ని చేపట్టి స్ట్రక్చర్ పూర్తి చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం దాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. రూ.160 కోట్లతో దాన్ని పూర్తి చేసేందుకు నేటి సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందని, గతంలోనే ఈ పనులకు సంబందించిన టెండర్లు ఖరారు అయిన నేపధ్యంలో వీటి పనులను నాలుగుఐదు రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందన్నారు. సీఆర్‌డీఏ, ఏడీసీ, మెప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మునిసిపల్ ఆఫీసు తదితర కార్యాలయాలన్నీ ఈ భవనంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో అమరావతి డవలెప్మెంట్ కార్పొరేషన్ దాదాపు 360 కి.మి. మేర ట్రంక్ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, అవి వివిద దశల్లో ఉన్నాయన్నారు. అయితే వాటి కాలపరిధి పూర్తి అయిన నేపథ్యంలో డిశంబరు మాసాంతానికల్లా తిరిగి టెండర్లను పిలువనున్నామన్నారు. రాజధాని ప్రాంతం ఎటు వంటి వరదలకు, ముంపుకు గురి అయ్యే అవకాశం లేకుండా ఉండేందుకై కొండవీటి వాగు, పాలవాగు, గ్రామిటీ కెనాల్ డిజైన్లను రూపొందించే పనిని నెథర్లాండ్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. అయితే ఈ మద్య కాలంలో బుడమేరు వల్ల విజయవాడ నగరానికి సంభవించిన ముంపును దృష్టిలో ఉంచుకుని మరింత పటిష్టవంతంగా డిజైన్లు రూపొందించాలని ఆర్.వి. కన్సన్టెన్సీకి అప్పగించడం జరిగిందని, ఆ డిజైన్ పనులు కూడా త్వరలో పూర్తి కానున్నాయని, వాటికి సంబందించిన టెండర్లను నవంబరు మాసాంతానికిల్లా పిలువనున్నామన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఐకానిక్ టవర్లకు సంబందించిన టెండర్లను కూడా డిశంబరు చివరికల్లా పిలవడం జరుగుతుందన్నారు. 2009 లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని కరకట్ట రోడ్డు డిజైన్ చేయడం జరిగిందని, అయితే బుడమేరు వరద దృష్ట్యా రిడిజైన్ చేసేందుకు కన్సల్టెన్సీకి అప్పగించడం జరిగిందని, ఈ పనులనకు సంబందించి 15 రోజుల్లో టెండర్లను పిలవడం జరుగుతుందన్నారు.
జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన E-7/9/11/13 రోడ్ల నిర్మాణ పనులకు సంబందించి టెండర్లను రెండు మాసాల్లో పిలవడం జరుగుతుందన్నారు.
ప్రపంచ బ్యాంకు నిధులు రూ.15 వేల కోట్ల మంజూరుకు సంబందించి పర్యావరణం మరియు సోషల్ మేనేజ్మంట్ తదితర అంశాలపై చర్చలు జరుగుచున్నాయని, ఈ ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చిందని, నవంబరు లేదా డిశంబరు మాసాల్లో ఈ నిధులు కూడా మంజూరు అయ్యే అకాశం ఉందన్నారు. ఇకపై ఎప్పటికప్పుడు సీఆర్‌డీఏ అకౌంట్స్ సబ్మిట్ చేయడం జరుగుతుందన్నారు. రాజధాని రైతులకు త్వరలోనే ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. పరిహారం విషయంలో కూడా రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో దాదాపు జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తి కావొచ్చిందన్నారు.
అమరావతి డెవలెప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పెర్సన్ లక్ష్మీ పార్థసారధి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News