-వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన…
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను బోధించే గ్రంధాన్ని రాసిన వాల్మీకి మహర్షి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వేటే జీవనాధారంగా బతికి, వేటను పక్కకు పెట్టి అహింసా వాదంలోకి వెళ్లి రామాయణం లాంటి మహా గ్రంధాన్ని అందించిన ప్రాతఃస్మరణీయులు వాల్మీకి మహర్షి అన్నారు. ఒక సామాన్యుడు తలచుకుంటే ఎంత అద్భుతమైన గ్రంథం వ్రాయగలరో వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో రచించి నిరూపించారని పేర్కొన్నారు. ఒక సామాన్యమైన బోయ కులంలో పుట్టి, తపస్సు చేసి, విద్వక్తును సంపాదించుకొని ప్రజా జీవితం ఏ విధంగా ఉండాలో రామ చరిత్ర ద్వారా నిరూపించిన మహానుభావులు వాల్మీకి మహర్షి అని వెల్లడించారు. మనిషి నైతిక విలువలు ఎలా ఉండాలో చెప్పిన మహనీయులు వాల్మీకి అని, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం అని శ్రీరాముడు చెప్పిన మాటను ప్రపంచానికి అందించిన మహోన్నత వ్యక్తి వాల్మీకి మహర్షి అని మంత్రి కీర్తించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.