-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలను దశల వారీగా తొలగిస్తామని, ప్రజా సౌకర్యార్ధం ఆక్రమణదారులు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ వైద్యశాల, రైల్ పేట ప్రధాన రహదారిలో డ్రైన్ మీద, రోడ్ల మీద ఆక్రమణలను ఏసిపి మల్లికార్జున ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక అక్రమ ఆక్రమణ దళం తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ల పై ఆక్రమణల వలన వ్యర్ధాలు అడ్డుపడి వర్షం నీరు రోడ్ల మీదకు, ఇళ్లల్లోకి వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ చేయడానికి కూడా డ్రైన్ లో పారుదల లేక సాధ్యం కావడంలేదన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైన్లపై ఆక్రమణలను గుర్తించి, వాటిని వారంతట వారే తొలగించుకోవాలని తెలియచేశామన్నారు. స్పందించని ఆక్రమణలను ప్రజల ఇబ్బందుల దృష్ట్యా జిఎంసి పట్టణ ప్రణాలికాధికారులు తొలగిస్తారని స్పష్టం చేశారు. వార్డ్ సచివాలయాల వారీగా పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో గుర్తించి, వాటి తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించామన్నారు. ప్రస్తుత వర్షాల వలన నగరంలో ఏ ప్రాంతంలో నీరు నిలిచి ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారో ఆయా ప్రాంతాల్లో భవిష్యత్ లో సమస్యలు రాకుండా తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. నగర ప్రజలు కూడా ప్రధాన డ్రైన్లను వివిధ వ్యాపారాల పేరుతొ ఆక్రమణ చేసుకోవద్దని, తప్పనిసరిగా డ్రైన్ కి వెనుక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. డ్రైన్ల మీద, డ్రైన్ కి ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు.