తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళయింది. నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు ముస్తాబు అవుతోంది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టిన టిటిడి పనుల్లో నిమగ్నమైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులతో కలిసి ఏర్పాట్లను టిటిడి జెఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్, హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడి రోడ్డు తదితర ప్రాంతాలను జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టిటిడి లోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమి తీర్థం లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, పూడి రోడ్డులోని గోశాల వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అర్థం అయ్యేలా తమిళ భాషలోనూ సైన్ బోర్డులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జేఈఓ వీరబ్రహ్మం. ఇక అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు టిటిడి సివిఎస్వో శ్రీధర్ తెలిపారు. పంచమి తీర్థం రోజున భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే షెడ్లలో, క్యూలైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టిటిడి సిఈ సత్యనారాయణ, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు తో పాటు పలువురు అధికారులు కూడా పర్యవేక్షించారు.