-అమరావతిలో పది ఎకరాల్లో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రం
-సరస్ ముగింపు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస వెల్లడి
-వరుసగా రెండో ఏడాది డ్వాక్ర బజార్ విజయవంతం/ శనివారం వరకు రూ.7.20 కోట్ల విక్రయాలు
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా స్వయంశక్తి సంఘాల సభ్యులు తాము తయారు చేసిన హస్తకళాకృతులు, ఉత్పత్తి చేసిన వస్తువులు ఏడాది పొడవునా మార్కెటింగ్ చేసుకొనేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను సెర్ప్ ద్వారా చేస్తున్నట్టు రాష్ట్ర సెర్ప్, చిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం రాష్ట్రంలో ప్రతి ఏటా నాలుగు చోట్ల అఖిల భారత డ్వాక్రా బజార్ ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. దీనితోపాటు అమరావతిలో పది ఎకరాల్లో శాశ్వత స్థాయిలో డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకం, ప్రదర్శన కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన స్థలం కోసం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును కోరామని, సి.ఎం. అందుకు అంగీకరించినట్టు చెప్పారు. అఖిలభారత డ్వాక్రా బజార్-2024 సరస్ ముగింపు సందర్భంగా స్థానిక లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులోని సరస్ ప్రాంగణం వద్ద ఆదివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని మహిళా స్వయంశక్తి సంఘాల సభ్యులకు ఇతర ప్రాంతాల్లో తయారయ్యే విభిన్న ఉత్పత్తుల గురించి తెలుసుకొనే ఒక గొప్ప అవకాశాన్ని యీ ప్రదర్శన కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా ప్రజలు వివిధ ప్రాంతాల్లో తయారయ్యే విభిన్న రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం ఏర్పడిందన్నారు. పదిరోజుల ప్రదర్శనలో రూ.7.20 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి స్టాల్స్ ఏర్పాటు నిమిత్తం వచ్చిన డ్వాక్రా సంఘాల వారికి మంచి ఆతిథ్యం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంటికో ఔత్సాహిక పారిశ్రామిక వేత్త తయారు కావాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.
నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి మాట్లాడుతూ ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రూపొందాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యానికి తగ్గట్టుగా ఔత్సాహికులు రూపొందడంలో ఈ ప్రదర్శన ఒక మంచి ప్రయత్నమని పేర్కొన్నారు. స్వయంశక్తి సంఘాల సభ్యులు రూపొందించే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ముఖ్యమని చెప్పారు. జిల్లాలో ప్రతి ఏటా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహించేందుకు మంత్రి చొరవ చూపాలని కోరారు.
డ్వాక్రా మహిళలు రూపొందించిన చేతి ఉత్పత్తులు, వస్త్రాలు, హస్తకళాకృతులు వంటి వాటిని కొనుగోలు చేయడం ద్వారా మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలని విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతి అన్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు గత పది రోజుల్లో తమకు కల్పించిన ఆతిథ్యం, వసతుల పట్ల సంతోషం, సంతృప్తి వ్యక్తంచేశారు. ఇక్కడ తాము మంచి వ్యాపారం చేయగలిగామని వారు చెప్పారు.
డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన యీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన నిర్వహణకు ఆర్ధిక సహాకారాన్నందించిన నబార్డు డి.జి.ఎం. నాగార్జున, ఎల్.డి.ఎం. రమణమూర్తి, డిసిసిబి సి.ఇ.ఓ ఉమామహేశ్వరరావు, ఇతర బ్యాంకుల అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు జ్ఞాపికలు బహూకరించి సత్కరించారు. ప్రదర్శన నిర్వహణలో సహకరించిన ప్రభుత్వ శాఖల అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.