Breaking News

కాకినాడ జిల్లాలో కాలువల మరమ్మతులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ

-గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి పనులకు నిధులు
-39 సాగునీటి పనులకు రూ.8.97 కోట్లకు ఆమోదం
-ఇటీవల ఏలేరు వరదలకు నష్టపోయిన పనుల కోసం మరో రూ.5.97 కోట్లు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు సాగు నీటి కాలువలకు అవసరమైన మరమ్మతుల విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరయ్యాయి. రానున్న రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటున్నారు. సాగునీటి కాలువల మరమ్మతులు, పూడికతీత, ఇతర మైనర్ పనులను చేపడతారు. 2023లో వచ్చిన మిచాంగ్ తుపాను ప్రభావానికి కాకినాడ జిల్లాలో పలు సాగునీటి కాలువలు, కట్టలు, గేట్లు, పూడికతీత వంటి సమస్యలు ఏర్పడ్డాయి. తుపాను తగ్గిన వెంటనే ఈ నష్టానికి సంబంధించి జిల్లా అధికారులు 288 ఇరిగేషన్ పనులు వెంటనే చేయాలని ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వానికి పంపారు. అయితే నాటి ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. తాజాగా ఏలేరు రిజర్వాయర్ కు వరద వచ్చినపుడు బాధిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్  క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు సాగు నీటి పనులకు సంబంధించిన గతంలో పంపిన ప్రతిపాదనలను అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేశారు. దీంతో వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి జలవనరుల శాఖ అధికారులతో దీనిపై చర్చించి అత్యవసరం చేయాల్సిన 39 పనులను గుర్తించారు. వీటికి సంబంధించి రూ.8.97 కోట్ల నిధుల పరిపాలన అనుమతులు లభించాయి. జలవనరుల శాఖ ద్వారా టెండరు నోటీసు వెంటనే ఇచ్చేలా చూడాలని, 2 నెలల్లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో గుర్తించిన సాగు నీటి పనులు వెంటనే జరగనున్నాయి.

ఏలేరు రిజర్వాయర్ వరదల పనుల గుర్తింపు
ఇటీవల వచ్చిన ఏలేరు వరదల్లో నష్టం జరిగిన సాగునీటి పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని జిల్లా అధికారులను  పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన ఏలేరు వరదలకు కొన్ని చోట్ల కాలువల గట్లు బలహీనం అయ్యాయి. పూడికతీతలు చేయాల్సి ఉంది. అలాగే మరికొన్ని మైనర్ మరమ్మతులు చేయాల్సిన తరుణంలో మొత్తం 87 పనులను దీనిలో గుర్తించారు. దీనికి రూ.5.97 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయి. ఈ నిధులను కొన్ని జిల్లా కలెక్టర్ నిధుల నుంచి, మరికొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి సర్దుబాటు చేసి వెంటనే పనులకు టెండర్లు పిలవాలని  పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని, వచ్చే పంటకాలం నాటికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా సాగునీటి సరఫరా సాగేలా చూడాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *