-సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు
-రాష్ట్రంలో 9 చోట్ల ఆరు రోజుల పాటు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ
-దేశంలోనే తొలిసారి జిల్లాల గ్రేడ్ 1,గ్రేడ్ 2 ఉపాధ్యాయులకు శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్ 1, 2 ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇలాంటి శిక్షణ ఇవ్వడంలో దేశంలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఘనత దక్కిందని, దేశ విద్యావిధాన చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS అన్నారు.
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు జరిగే ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణం ఎస్-జే కన్వెన్షన్ సెంటర్ నుంచి సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా అడిషనల్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి , ఎన్టీఆర్ జిల్లా డీఈవో, ఏపీసీలు సుబ్బారావు, మహేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంచడమే ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ప్రధాన లక్ష్యమని, ఇది క్షేత్రస్థాయిలో అమలవుతుందన్నారు. ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జాతీయ విద్యా విధానానికి, నిపుణ్ భారత్ అనుగుణంగా రూపొందించామని తెలిపారు. ఈ శిక్షణ 1, 2 తరగతులపై దృష్టి సారించడానికేనని 3 నుండి 8 సంవత్సరాల పిల్లలకి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయమన్నారు. ప్రాథమిక విద్యా నాణ్యత పెరుగుతుందనేది ఒక దృక్పథంగా ఉండాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత మెరుగైనట్లయితే, పిల్లలు ప్రైవేట్ పాఠశాలలను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలను సాధించడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించి సత్ఫలితాలను అందించడానికి పనికొస్తుందన్నారు.
రాష్ట్రమంతటా ఉన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2 క్యాటగిరీ లో ఉన్న 34,000 మంది ఉపాధ్యాయులు 14 విడతలు(స్పెల్స్) లో పాల్గొంటారని, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శ్రీకారం చుట్టిన ఈ బృహత్కార్యాన్ని ఉపాధ్యాయలోకం విజయవంతం చేయాలని కోరారు. విద్యా రంగానికి కొత్త దిశను ఇవ్వడానికి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ విద్యా రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్ మాడ్యూళ్లను ఆవిష్కరించారు.
శిక్షణ జరుగుతున్న జిల్లాలివీ…
సోమవారం నుండి అక్టోబరు 26 వరకు జరిగే ఈ శిక్షణకు శ్రీ విశ్వవిజేత జూనియర్ కళాశాల (శ్రీకాకుళం), ఒయెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్, (విజయనగరం), సత్యసాయి పరిమళ పాలిటెక్నిక్ కాలేజ్ (రాజమండ్రి, తూ.గో), ఎస్-జే సెంటర్,లయోలా కాలేజ్(ఎన్టీఆర్), మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ (పెదపరిమి, గుంటూరు), మద్జీ స్కూల్ (తిరుపతి), గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజ్ (వైయస్సార్ కడప), బిట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హిందూపురం, శ్రీ సత్యసాయి), విజయభారతి బీఈడీ కాలేజీ (బుక్కరాయసముద్రం, అనంతపురం జిల్లా) కేంద్రాలుగా నిలిచాయి. మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1700 మంది ఉపాధ్యాయులకు రెసిడెన్షియల్ విధానంలో జరిగే శిక్షణకు హాజరయ్యారు.