మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భూ సమస్యలకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కోర్టు కేసులకు సమస్యల పరిష్కారం, జాతీయ రహదారుల భూ సేకరణ సమస్యలు, ధాన్యం సేకరణ, రీ సర్వే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించిన విషయాలలో అధికారులు వెంటనే స్పందించడం ద్వారా కోర్టులో కేసు అడ్మిట్ కాదని, అలాకాకుండా నిర్లక్ష్యం చేస్తే కౌంటర్లు దాఖలు చేయడం, వాయిదాలకు తిరగడానికి సమయం వృధా అవుతుందని, కావున ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యధికంగా మచిలీపట్నం, బంటుమిల్లి, గుడివాడ మండలాల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల అధికారులు వారి పరిధిలోని కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏపీ ఓఎల్ సీఎంఎస్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా కౌంటర్ దాఖలు, కేసుల స్టేటస్ ను తెలుసుకోవచ్చని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు, అదేవిధంగా వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించిన భూముల్లో ఏ విధమైన పనులు ప్రారంభించక పోతే, తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించాలన్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని పెండింగ్ భూ సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ఆయా ప్రాంతాలలో పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే నవంబర్ రెండవ వారంలో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, అందుకు సంబంధిత అధికారులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, అయితే ఇటీవల కురిసిన అధిక వర్షాలు, వరదల నేపథ్యంలో కొంతమంది రైతులు తిరిగి మరల వరి నాట్లు వేయడంతో ధాన్యం సేకరణలో హెచ్చుతగ్గులు ఉంటే అవకాశం ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 302 రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడతామని తెలుపుతూ రైతుకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకోవచ్చని, దీనిపై గ్రామాలలో సభలు నిర్వహించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ధాన్యం తేమ శాతం ఇటు రైతు సేవ కేంద్రాలతో పాటు మిల్లు వద్ద కూడా కొలవడం జరుగుతుందన్నారు. రైతు సేవ కేంద్రాలలో పని చేయని తేమ శాతం కొలిచే యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
రైతు సేవా కేంద్రాలలో అవసరానికి తగిన విధంగా గోనె సంచులను ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక సహాయకుల (టెక్నికల్ అసిస్టెంట్లు) భర్తీ, ఇతర విధులను నిర్వర్తించేందుకు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్వో కే చంద్ర శేఖరరావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, డీఎస్ఓ వి పార్వతి, పౌర సరఫరాల సంస్థ డిఎం సృజన, భూ సర్వే రికార్డుల ఏడి జోషిలా, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.