మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో సబ్ డివిజన్స్, మ్యుటేషన్స్ వంటి భూసమస్యలపై వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించి రెవిన్యూ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించేలా కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి మీకోసం అర్జీలు, నీటి తీరువ పన్ను వసూళ్లు, ఇసుక సరఫరా తదితర రెవిన్యూ అంశాలపై డివిజనులు, మండలాల వారిగా సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అర్జీలపై కలెక్టర్ సమీక్షిస్తూ మీకోసంలో వస్తున్న అర్జీలలో రెవెన్యూ కు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయని, ముఖ్యంగా భూముల రీ సర్వే సమస్యలు, మ్యూటేషన్స్, సబ్ డివిజన్స్ వంటి భూసమస్యలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. రి సర్వే జరగని గ్రామాల్లో భూముల సబ్ డివిజన్స్ ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి, వివాదాలు లేని సబ్ డివిజన్ సమస్యలను పరిష్కరిస్తే రాబోయే వివాదాలను నివారించవచ్చునని, ఈ దిశగా రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి కార్యాలయాల నుండి వచ్చే అర్జీలు నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలన్నారు. రెవిన్యూ సేవలకు సంబంధించిన సమస్యలు, సర్వే సంబంధిత సమస్యలపై వచ్చే పిటిషన్స్ ఆయా సేవల విభాగానికి పంపాలని కలెక్టర్ సూచించారు. సరైన ఎండార్స్మెంట్ ఇస్తే రీఓపెన్కు అవకాశం ఉండదని, మరియు ఎండార్స్మెంట్ పిటిషనర్ కు తప్పనిసరిగా సర్వ్ చేయాల్సి ఉంటుందని, తాసిల్దార్లు ఇచ్చిన ఎండార్స్మెంట్లు సరిగా వున్నాయా లేదా ర్యాండంగా చెక్ చేయాలని ఆర్డీవోలకు సూచించారు.
తాసిల్దార్లకు గతంలో సూచించిన విధంగా గ్రామాల వారి గ్రీవెన్స్ ప్రొఫైల్ తయారు చేయకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సుల తేదీ ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించవచ్చని,ఇకనైనా ఆయా గ్రామాల్లో ఆయా ప్రాంతాలలో ఎక్కువగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, ప్రొఫైల్ తయారు చేయాలని, ఇది రెవెన్యూ సదస్సుల నిర్వహణ సులభం చేస్తుందన్నారు. నీటి తీరువ పన్ను వసూల్లు మండల వారి కలెక్టర్ సమీక్షించారు. కోట్లాది రూపాయల పెండింగ్ వున్నందున, వీఆర్వో లతో మాట్లాడి వసూళ్లు వేగవంతం చేయాలన్నారు.
కొత్త అనధికార లేఔట్స్ ఒక్కటి కూడా రాకూడదని, ముఖ్యంగా రాష్ట్ర జాతీయ రహదారుల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలన్నారు. ఇసుక రీచ్ లలో జెసిబి, ప్రోక్లైన్ లాంటి యంత్రాలతో తవ్వకాలు జరపరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనధికార ఇసుక స్టాక్ యార్డ్ లు ఎక్కడా పెట్టకుండా తొలిదశలోనే నియంత్రించాలని, ఇదివరకే ఏమైనా ఉంటే వెంటనే తొలగించుటకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఫోటో ఓటర్ల జాబితాప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం జరగాలన్నారు. జిల్లాలో ఎవరైనా అంగన్వాడిలు బిఎల్వోలుగా ఉంటే, వారి స్థానంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించాలని, బిఎల్వోలుగా నూరు శాతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణ -గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి జిల్లాలో పట్టభద్రులైన వారిని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ పట్టబద్రులు కావున, వీరిని తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం గడువు దాటినవి పెండెన్సీ జీరో అయిందని, అది అలాగే కొనసాగించాలని, , రీఓపెన్ తగ్గించాలని సూచించారు. మ్యుటేషన్స్ సరిగా చేయకపోవడంతో తాసిల్దార్లను తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తామన్నారు.
డి ఆర్ వో కే చంద్రశేఖర రావు మాట్లాడుతూ జిల్లాలో మీకోసం లో వచ్చే అర్జీలలో పెండింగ్ సింహభాగం, గడువు దాటిన అర్జీలలో సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాబట్టి సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి సమీక్షిస్తున్నారని, కావున వీటిపై దృష్టి సారించాలన్నారు.
పిజిఆర్ఎస్ నోడల్ అధికారి, కె ఆర్ ఆర్ సి ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుండి అందే పిటిషన్స్ జిల్లా కలెక్టర్ వారి ఎండార్స్మెంటుతో ముగించాల్సి ఉన్నందున, గడువు దాటే వరకు ఆగకుండా, మూడు రోజులు ముందుగానే కలెక్టర్ వారి కార్యాలయానికి పంపాలని అన్నారు
సమావేశంలో గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నం ఆర్డీవోలు బాలసుబ్రమణ్యం, షారోన్, కే. స్వాతి, కలెక్టరేట్ ఏవో, తాసిల్దార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News