Breaking News

స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం, మంచి అల‌వాట్లు, సంక్ర‌మ‌ణ వ్యాధుల నివార‌ణ‌కు కీల‌క సూత్రాల్ని సూచించిన నిపుణుల క‌మిటీ

-గుర్లలో డయేరియా వ్యాప్తికి కలుషిత తాగు నీరే కారణమ‌న్న నిపుణుల క‌మిటీ
-వ్యాధుల వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి చేప‌ట్టాల్సిన త‌క్ష‌ణ‌, దీర్ఘ‌కాలిక చర్య‌ల‌పై సూచ‌న‌లు
-విజయనగరం భౌగోళికంగా, పర్యావరణపరంగా ఇటువంటి వ్యాధి వ్యాప్తికి అనుకూలమని వెల్ల‌డి
-నమూనాల సత్వర పరీక్ష కోసం ప్రాంతీయ ప్ర‌యోగ‌శాల అవ‌స‌ర‌మ‌ని సిఫార‌సు చేసిన నిపుణుల క‌మిటీ
-సమగ్ర నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించిన బృందం
-నిపుణుల క‌మిటీ నివేదిక‌ను, గుర్ల అనుభ‌వాలపై త్వ‌ర‌లో చ‌ర్చించ‌నున్న ఆరోగ్య శాఖా మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయనగరం జిల్లా గుర్లలో తీవ్రస్థాయిలో డయేరియా వ్యాధి ప్రబలటానికి (Acute Diarrheal Disease-ADD) దారితీసిన కార‌ణాలు, భ‌విష్య‌త్తులో అట్టి ప‌రిస్థితిని అరిక‌ట్ట‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ఆరుగురు
సభ్యులతో కూడిన నిపుణుల బృందం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా మంత్రిత్వ శాఖకు సమగ్ర నివేదికను అంద‌జేసింది. ఇద్దరు జనరల్ మెడిసిన్ వైద్యులు, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ, పీడియాట్రిక్స్ నిపుణులు మరియు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌లతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం మంగ‌ళ‌వారం
సాయంత్రం మంత్రిత్వ శాఖకు నివేదికను అందచేసింది.

రోగులు, వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బందితో విస్తృత చర్చలు జరపడంతో పాటు నీటి వ‌న‌రులు, నీటి స‌ర‌ఫ‌రా చేసే పైపులైన వ్య‌వ‌స్థ, తీవ్రస్థాయిలో ప్రభావితమైన ప్రాంతాలు, మరుగుదొడ్ల లభ్యత, వినియోగాన్ని తనిఖీ చేయడంతో పాటు మల నమూనాల పరీక్షా ఫలితాల పరిశీలన ఆధారంగా నిపుణుల బృందం సమగ్ర నివేదికను రూపొందించింది. పరిశీలనలో భాగంగా నిపుణుల బృందం గుర్ల, కోటగండ్రేడు, నాగులవలస, దమ్మసింగి, కెల్ల తదితర గ్రామాల్లో పర్యటించింది.

తాగునీరు విస్తృతంగా కలుషితం కావడమే ఈ ప్రాంతంలో డయేరియా వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలటానికి ప్రధాన కారణమని బృందం నిర్ధారించింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (RRT) గుర్ల నుండి సేకరించిన 44 నీటి నమూనాలలో 31 న‌మూనాల్లో కోలిఫారమ్‌లు ఉన్నట్లు నిర్ధారించి, తాగునీరు ఉప‌యోగం కాద‌ని నిర్ధారించింది. 57 మలం నమూనాల పరీక్షా ఫ‌లితాల ఆధారంగా భూత‌ల‌, భూగ‌ర్భ జ‌లాలు క‌లుషిత‌మైన‌ట్లు తేల్చి చెప్పింది.

గుర్ల మ‌రియు త‌దిత‌ర గ్రామాలకు ప్ర‌ధాన నీటి వ‌న‌రు అయిన చంపా న‌దిలో దహన సంస్కారాలు, జాతరలు మరియు పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నార‌ని క‌మిటీ గ‌మ‌నించింది. చెంపా న‌ది వెంబడి ఉన్న ప్రాంతాల నుండి ఎక్కువ డయేరియా కేసులు నమోదయ్యాయని ఈ బృందం గుర్తించింది.

గుర్ల మరియు పొరుగు గ్రామాలకు నీటిని పంపింగ్‌, సరఫరా చేసే బోర్‌వెల్ కూడా న‌ది ఒడ్డునే ఉంది. నీటి
పైప్ లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా పోతున్నాయి. చంపానదీ తీరం మరియు గుర్ల గ్రామ సమీపంలో మురుగునీరు, ఉప్పునీరు పారుతోంద‌ని, దీంతో పాటు ప్ర‌జ‌లు బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న చేస్తున్నార‌ని క‌మిటీ తెలిపింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో భూగర్భ నీటి మట్టం పెరగ‌డం వ‌ల్ల నీటి కాలుష్యం ఏర్ప‌డింద‌ని క‌మిటీ గ‌మ‌నించింది. వ్యాధుల వ్యాప్తి నివారణకు అవసరమైన క్లోరినేషన్ పేలవంగా వుందని అభిప్రాయపడింది. పరీక్షించిన నీటి నమూనాలలో క్లోరిన్ అవశేషాలేమీ లేకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. నీటి నమూనాలలో క్లోరిన్ ఉన్న ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో సంక్ర‌మ‌ణ వ్యాధులు రాకుండా, ప్ర‌బ‌ల‌కుండా చేయ‌డానికి ప‌రిశుభ్ర‌మైన తాగునీరు, పారిశుధ్యంతో కూడిన వాతావ‌ర‌ణం, ఆరోగ్యానుకూల అల‌వాట్ల‌ను పెంపొందించ‌డానికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌మిటీ సూచించింది.

తాగు నీటి ప్రధాన వనరు అయిన చంపా నది నీటిని తరచుగా క్లోరినేషన్ చేయడం, నీటి సరఫరా పైపులకు మరమ్మతులు, నిర్వహణ చేప‌ట్ట‌డం, డ్రైనేజీ గుండా నీటి పైపు లైన్ లు వెళ్లకుండా ప్రత్యామ్నాయ పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయ‌డం, తాగునీరు, ఓవర్‌హెడ్ ట్యాంకులు మరియు ఇళ్ల వద్ద ప్రతి పదిహేను రోజులకోసారి తనిఖీ చేయ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని బృందం సిఫార‌సు చేసింది. ఇళ్ల‌ల్లో తాగునీటిలో క‌ల‌ప‌డానికి క్లోరిన్ మాత్ర‌ల ల‌భ్య‌త‌, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం, ORS ద్రవాలు తగినంత లభ్యత, బ్లీచింగ్ పౌడర్ లభ్యమయ్యే విధంగా చర్యలు తీసుకోవటంతో పాటు, పరిశుభ్రమైన అలవాట్లను పెపొందించేందుకు యువత మరియు ప్రజా సంఘాల్ని చైత‌న్య‌ప‌ర్చాల‌ని సూచించింది.

విజయనగరం యొక్క భౌగోళిక స్థితి, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు సంక్ర‌మ‌ణ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున వివిధ న‌మూనాల‌ను ప‌రీక్షేందుకు వీలుగా ప్రాంతీయ ప‌రీక్షా శాల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌మిటీ సిఫార‌సు చేసింది.

ఆరుగురు నిపుణుల బృందం అంద‌జేసిన నివేదిక‌లోని అంశాల్ని మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారులు, క్షేత్ర స్థాయి వైద్యుల‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ త్వ‌ర‌లో స‌మీక్షించి
మున్ముందు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్ని నిర్ధారిస్తారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *