విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ చదవటం, రాయడం తెలిసి ఉండి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహించే ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు.
పదిహేనేళ్లకు పైబడిన వయస్సు వారిలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించే ఉద్దేశంతో నిర్దేశించిన ఉల్లాస్ (అండర్‌స్టాండింగ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమ అమలును బుధవారం ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పాఠశాల, వయోజనవిద్య, డీఆర్‌డీఏ, గ్రామ-వార్డు సచివాలయాలు, ఐసీడీఎస్; సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన అధికారులతో ఆమె మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిసారించాయని, పథకం లక్ష్యాల సాధనకు అధికారులు తమ వంతు కృషి ఉండాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఆయాలు, కుక్‌లు, హెల్పర్లు, నైట్ వాచ్‌మ్యాన్లు, అంగన్వాడీ సహాయకులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు.తొలిదశలో జిల్లాలో ఏడువేల మంది లబ్ధిదారులను గుర్తించి, అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. తొలుత విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ), క్లస్టర్ కోఆర్డినేటర్ల ద్వారా గుర్తించిన లబ్ధిదారులకు శిక్షణ అందించేందుకు ప్రతి పదిమందికి ఒక వాలంటీర్ టీచర్‌ను గుర్తించాల్సి ఉందన్నారు. ఇద్దరు మండల స్థాయి అధికారులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో శిక్షణను ఇవ్వడం జరుగుతుందని అనంతరం జిల్లాస్థాయిలో, మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నవంబర్ నుండి సాయంత్రం రెండు గంటల పాటు తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కాన్ఫరెన్స్ లో ఉల్లాస్ కార్యక్రమ నోడల్ అధికారి జి.ప్రసాద్‌రావు, డిఆర్ డిఎ పిడి శ్రీనివాసరావు, ఏపీవో ఎం.సింగయ్య, డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి,గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి ఉన్నారు.
Prajavartha Online Telugu News