విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను సీఎం చంద్రబాబునాయుడు తక్షణమే అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద, బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చిన సూపర్-6 పథకాల అమలు నుంచి తప్పించుకునేందుకు దారిమళ్లింపు రాజకీయాలు చేస్తోందన్నారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగితేనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న చోట బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తోందన్నారు. మితిమీరిన విశ్వాసంతోనే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. అమెరికాలో కూడా బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారన్నారు. చంద్రబాబు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ అమరావతి, పోలవరం తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలవరం వందేళ్లయినా పూర్తి కాదని ఆయన స్పష్టంచేశారు. పెన్షన్లు ఇవ్వడం తప్ప ఏ హామీ అమలు కాలేదన్నారు. ప్రజల దృష్టిమళ్లించడానికి సీఎం చంద్రబాబు రోజుకో వివాదం, అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. మొన్న తిరుపతి లడ్డూ, నిన్న డ్రోన్ సదస్సు అంటూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …