-గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఏ నమ్మకంతో అఖండ మెజార్టీ అందించారో ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కూటమి పనిచేస్తోందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పెండింగ్ సమస్యలు తీర్చడంతో పాటు కొత్తప్రాజెక్టులపైనా దృష్టి పెట్టి శ్రమిస్తున్నట్లు తెలిపారు. వినుకొండ మండలం గోకనకొండ-నూజండ్ల మండలం పువ్వాడ మధ్య గుండ్లకమ్మ నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి గురువారం వారు ముగ్గురు శంకుస్థాపన చేశారు. రూ.20.15 కోట్లతో చేపట్టనున్న ఈ వంతెన ఏర్పాటుతో నూజండ్ల మండల ప్రజలు వినుకొండ మండలం, పట్టణంతో పాటు బాపట్ల జిల్లాకు, గుంటూరుకు సులువుగా రాకపోకలకు అవకాశం లభిస్తుంది. పువ్వాడ ఎస్సీ కాలనీలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకాన్ని కూడా వారు ప్రారంభించారు. ములకలూరులో సీసీ రహదారులు, మినీ గోకులం నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుండ్లకమ్మపై వంతెన అవసరాన్ని ఎంపీ లావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి దగ్గరుండి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులైందని, ఈ క్రమంలో ప్రతిఒక్కరం ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నామన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఒక్కసంతకంతో 65 లక్షలమందికి పింఛన్లు పెంచారని గుర్తు చేశారు. అలానే 175 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు . లోకేష్ యువగళం పాదయాత్ర చేసినప్పుడు చాలామంది యువకులు కలిసి ఉద్యోగాలు గురించి మాట్లాడారని, అందుకే మెగా డీఎస్సీ ప్రకటించి 6,350 మందికి పరీక్షలు పెట్టి రాబోయే రోజుల్లో టీచర్లుగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐదేళ్లలో 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. త్వరలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనతో పెద్దఎత్తున కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తర్వాత మాట్లాడిన ఎంపీ లావు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య గురించి ముఖ్యంగా చెప్పడం జరిగిందన్నారు. దానికి శాశ్వత పరిష్కారం గోదావరి జలాలు సాగర్ కుడి కాల్వలో కలపడమేనని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిసినప్పుడు కూడా నదుల అనుసంధానంపై చర్చ జరిగిందన్నారు. అందుకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. బొల్లాపల్లి, మాచర్ల ప్రాంతాల తాగు, సాగునీటికి కోసం వరికపూడిశెల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకాన్ని కూటమి ప్రభుత్వ పరంగానే ముందుకు తీసుకెళ్తున్నామన్నా రు. టెండర్లు కూడా పిలవడం జరిగిందని, వినుకొండ నియోజకవర్గంలో 30%గ్రామాల్లో టెండర్లు పిలిచారన్నారు. ఆయా గ్రామాల్లో పనులకు బిల్లులకు ఇబ్బంది లేకుండా మనసు పెట్టి పనులు చేసి తాగునీరు ఇచ్చేవిధంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రోడ్లు, సైడ్ కాల్వలు కావాలని ఎన్నికల సమయంలో ప్రజలంతా కోరారని, దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద హైలెవెల్ వంతెనను మంజూరు చేయించుకోగలిగామని, 24 నెలల్లో పూర్తి చేస్తామని గుత్తేదారు చెబుతున్నారని, వీలైనంత త్వరగా ఇంకా ముందుగానే పూర్తి చేస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. తర్వాత మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్థుడు ఇన్‌ఛార్జి మంత్రిగా రావడం వల్ల ప్రజలకు కచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం అందుతుందన్నారు. పల్నాడు ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు గొట్టిపాటి రవికుమార్ సహకరిస్తారన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. గత తెదేపా ప్రభుత్వంలో గ్రామాల్లో అనేకమంది అభివృద్ధి పనులు చేశారని, వారికి ఇప్పటివరకూ బిల్లులు రాలేదని, ఈ విషయం ఇన్‌ఛార్జి మంత్రి రవికుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ బిల్లులన్ని ఇప్పించాలని కోరారు. పువ్వాడ ప్రాంతం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, పొలాలకు నీళ్లు లేవు, ఎత్తిపోతల పథకాలకు నిధులు ఇవ్వాలని అడిగితే సీఎం చంద్రబాబు వెంటనే నూజండ్ల మండలానికి 6 ఎత్తపోతల పథకాలు మంజూరు చేసి రూ.113 కోట్లు ఇచ్చారన్నారు. పువ్వాడలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పువ్వాడ ఎత్తిపోతల పథకం నిర్మించి రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పువ్వాడ ఎస్సీ కాలనీ తరహాలోనే భవిష్యత్తులో గ్రామగ్రామాన ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజల వద్దకే పాలన మళ్లీ రాబోతోందని, క్యాస్ట్, ఇన్కమ్ తదితర సర్టిఫికేట్ల కోసం కోసం ఆఫీస్‌ల చుట్టు తిరాగాల్సిన పనిలేదని లోకేష్ చొరవతో 100 రకాల సేవలు మీ ఫోన్, మీ కంప్యూటర్లో క్లిక్‌తో లభిస్తాయన్నారు. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మరోపక్క జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధ్యత తీసుకుని అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతాల్లో ప్రగతి పథంలో ముందుకు నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.