-బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు
-రానున్న రోజుల్లో వాడవాడల్లో పార్టీ పోరాటాల బాట, కమ్మలు, రెడ్లు మా ఘోష అర్థం చేసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొన్న మహాధర్నా నిర్వహించాము, కులగణనపై మా పోరాటం ఇక తీవ్రం తరం చేయడానికే నిర్ణయించుకున్నాము. ఇందులో భాగంగా పార్టీ బీసీ సంఘాలతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు జరిగింది. ఇక సమీప భవిష్యత్తులో వాడవాడలా, గ్రామా గ్రామాన, కొండా, కోన, ఊరు, పట్నం అన్ని చోట్ల కులగణన పోరు హోరుగా మారనుందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ డీజీపీ డా పూర్ణచంద్ర రావు తెలియజేసారు. గురువారం విజయవాడలోని బీసీసంఘాల సమన్వయ కమిటీ ఏర్పాటు సందర్భంగా వారు మీడియాని ఉద్దేశించి ఇలా అన్నారు: :అటు తెలంగాణాలో బీసీల డిమాండుకు తలవొగ్గి ప్రభుత్వం కులగాణపై చర్యలకు ఉపక్రమించింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో బీసీల సర్కారు అని గొప్పలు చెప్పుకునే సర్కారుకు మాత్రం చీమ కుట్టినట్టు లేదు. నయాపైసా ఖర్చు లేకుండా బీసీ రక్షణ చట్టం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎందుకు కల్పించలేరు?
అందుకే ఇక కులగణన ఉద్యమరూపం దాల్చే విధంగా వాడవాడలా, గ్రామశతిలో సమన్వయ కమిటీల ద్వారా పోరాటాలను రూపొందిస్తున్నాము. మా రెడ్డి, కమ్మ సోదరులకు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము, మమ్మల్ని మీతోపాటుగా రాజ్యాధికారంలో భాగం చేసుకోండి. క్యాపిటలిస్టు రాజకీయాలకు తలవొగ్గి చేసే పాలనలు ఎక్కువ రోజులు నిలవవు. ఒక మాజీ పోలీసు అధికారిగా కాదు, ఒక గుండెలు మండిన దేశ పోరునిగా చెప్తున్నా, ఇదే కొనసాగితే మీ ప్రభుత్వాల పునాదులు పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్. కాబట్టి కులగణన చేయండి. పెరుగుతున్న పేదరికాన్ని ఇష్యూ చేయని, డైవర్షన్ పాలిటిక్స్ కాదు.
రోజుకు 70 మంది మిల్లియనీర్లు మనదేశములో పుట్టుకొస్తున్నందుకు ఆనందపడాలో లేక 60 కోట్ల ప్రజల ఆస్థి 16 బిలియనీర్ల ఆస్తికి సమానమై ఉందని బాధపడాలో మనమే నిర్ణయించుకోవాలి. ధనవంతులపై వెల్త్ టాక్స్ రద్దు చేసే ప్రభుత్వాలు పేదలకు ఏమి చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి మాట్లాడుతూ, బీసీ సమన్వయ కమిటీ , బహుజన సమన్వయ కమిటీ లు ఇకపై కలిసి పనిచేస్తాయి. బహుజన సమాజ్ పార్టీ చొరవ తీసుకొని పార్టీలకతీతంగా, సంఘాలకతీతంగా అన్ని సంఘాల వాళ్ళని అన్ని పార్టీల నాయకులు ఉన్నటువంటి బీసీ నాయకులు అందర్నీ కూడా సంఘటితపరిచి ఇంతకుముందే ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ముందు అటు కులగణన, ఇటు బీసీల హక్కుల సాధన, ఇటు బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమాల ద్వారా పార్టీ సంస్థాగతంగా బలపర్చుకుని సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News