-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-ప్రసూతి మరణాలకు బాధ్యులుగా తేలితే చర్యలు తప్పవు: కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసూతి మరణాలు జరగకుండా చూడాలని, అన్ని ఆసుపత్రుల్లో ప్రసవ సమయంలో తప్పనిసరి డెలివరీ ప్రోటోకాల్ పాటించాలని, ప్రసూతి మరణాలకు బాధ్యులుగా తేలితే చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో జూన్ 2024 నుండి సెప్టెంబర్ 24 వరకు జరిగిన ప్రసూతి మరణాలపై సంబంధిత కుటుంబ సభ్యులతో, చికిత్స అందిందించిన డాక్టర్లు , అంగన్ వాడి, ఎ.ఎన్.ఎం. ఆశాలతో జిల్లా కలెక్టర్ మరియు మెటర్నల్ డెత్ సర్వేలన్స్ రెస్పాన్స్ కమిటి అధ్యక్షులు డా.ఎస్. వెంకటేశ్వర్ అధ్యక్షతన ఆడిట్ నిర్వహణ జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నపాటి పొరపాటుకు తావులేకుండా ప్రసవ సమయంలో నియమావళి మేరకు వైద్యపరీక్షలు జరిపి తల్లి, బిడ్డ క్షేమానికి ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులల్లో జరిగే మాతృ మరణాల పై సంబందిత బంధువులు వివరణ పరిగణలోకి తీసుకుంటామని , నిర్లక్ష్యం వహించిన వారిపై తప్పనిసరి చర్యలు ఉంటాయని అన్నారు. గర్భవతి నుండి ఆమె ఆరోగ్యం కోసం అంగన్వాడి పోషకాహారం అందించడం, ఎ.ఎన్.ఎం. ప్రతినెల ఆసుపత్రికి తీసుకువెళ్ళి పరీక్షలు నిర్వహించి అనీమియా వంటివి లేకుండా చూడటం, ఆశాలు వారు సరైన సమయానికి చికిత్స పొందుతున్నారా లేదా చూడాలని అన్నారు. ఒక మరణం జరిగితే ఆశా నుండి ప్రసవ సమయంలో వున్న డాక్టర్ వరకు భాద్యత వహించాల్సి వుంటుందని , నిర్యక్ష్యంకు తావు ఇవ్వరాదని, ఇది వారి ప్రాణానికి సంబంధించిన అంశం అనేది గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసూతి ప్రోటోకాల్ మేరకు అన్ని వసతులు, డాక్టర్లు అందుబాటులో వుండాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వ హై రిస్క్ టీం కు సమాచారం అందించాలని సూచించారు. మరణించిన వారి బంధువుల అభిప్రాయం మేరకు ఎవరి వద్ద తప్పు జరిగింది? అంగన్ వాడిల నుండి పౌష్టికాహారం అందకనా ? ఎ.ఎన్.ఎం. ప్రతినెలా సరైన సూచనలు ఇవ్వకనా? డ్యూటీ డాక్టర్లు, ప్రసవ సమయంలో వున్నా డాక్టర్లు సరైన చికిత్స ఇవ్వకనా? అనేవి రికార్డులతో పరిశీలించి చర్యలు తీసుకోనున్నామని అన్నారు. జూన్ 24 నుండి సెప్టెంబర్ 24 వరకు మరణించిన 4 మాతృ మరణాలకు చెందిన బందువుల స్టేట్ మెంట్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ లక్ష్యం జీరో మరణాలని అన్నారు. అంగన్ వాడి లు, ఎ.ఎన్.ఎం.లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యం, సౌకర్యాలను పేదలకు వివరించాలని, అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చూడాలని, వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. గర్భవతులు ఆరోగ్యంగా వున్నా నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలని అన్నారు.
ఇందులో సి ఆర్ రెడ్డి ఆసుపత్రి గూడూరు లో ఎక్కువగా సిజెరియన్ సర్జరీలు జరుగుతున్నాయని, దానిపై డిఎంహెచ్ఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అన్వేష్ ఆసుపత్రి గూడూరు లో జరిగిన మాతృ మరణంపై త్రిసభ్య కమిటీ తో విచారణ జరిపి చర్యలు తీసుకోవడానికి ఆదేశించారు.
ఎస్సీ ఎస్టీ కాలనీలు, గిరిజన ప్రాంతాలు, అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అంగన్వాడీ, మహిళా పోలీస్, ఆశాలు తదితరులు చైతన్య వంతులను చేయాలని అన్నారు.
ఈ సమీక్షలో డిసిహెచ్ఎస్ ఆనంద మూర్తి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని జయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి శాంత కుమారి, అదనపు డిఎంహెచ్ఓ ఓ.శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ పార్థ సారధి రెడ్డి, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.