-దీపం -2 పథకం కింద గ్యాస్ బుక్ చేసుకొన్న లబ్ధి దారులకు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలకు 48 గంటల్లోపు జమ: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
-సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ
తడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ అమలులో భాగంగా నేడు అర్హులైన తెల్ల రేషన్ కార్డు దారులందరికీ దీపావళి కానుకగా దీపం -2 పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నేడు శ్రీకారం చుట్టి అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇది ప్రజా సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను సమ పాళ్లలో అమలు చేస్తున్న ప్రభుత్వం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 1న నేడు రాష్ట్ర వ్యాప్తంగా దీపం -2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం నుండి ప్రారంభించగా తడ మండలం రామాపురం గ్రామం నుండి సూళ్లూరుపేట నియోజక వర్గ కార్యక్రమంలో దీపం -2 ఉచిత గ్యాస్ పంపిణీ పండుగ వాతావరణంలో నిర్వహించగా శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని పండుగ వాతావరణంలో దీపం -2 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ అమలులో భాగంగా ప్రధాన అంశం ఉచిత గ్యాస్ పంపిణీకి నేడు శ్రీకారం చుట్టిందనీ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపుదల, మెగా డీఎస్సీ ఫైలు పై సంతకం, స్కిల్ సెన్సస్ సర్వే, దీపం పథకం అమలు ఫైళ్లపై సంతకం చేశారని గుర్తు చేశారు. ఈ నెల డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్నదని, స్కిల్ సెన్సస్ సర్వే ప్రారంభమైందని ఇందులో ఇంటింటికి సిబ్బంది వెళ్లి యువతకు సంబంధించిన విద్యార్హతలు వారి నైపుణ్య వివరాలు సేకరించి వారికి ఉపాధి కల్పన దిశలో వారికి దగ్గర్లోని పరిశ్రమల అవసరాల దృష్ట్యా శిక్షణ ఇచ్చి అనుసంధానం చేసి ఉపాధి కల్పించే దిశలో చర్యలు జరుగుతున్నాయని, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది వెళ్లి పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. గతంలో దీపం పథకం 2014-19 సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసిందని, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీపం-2 పథకం అమలు ద్వారా బిపిఎల్ తెల్ల రేషన్ కార్డు కలిగిన వినియోగదారులకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి మూడు ఉచిత ఎల్ పి జి గ్యాస్ సిలిండర్లను అందిస్తోందని అన్నారు. మన జిల్లాలో 600307 కార్డులు ఉన్నాయని, యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ కలిగి మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఆధార్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడు ప్రభుత్వం వారు ప్రకటించిన మూడు ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లో భాగంగా దీపం- 2 పథకంలో ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాది కి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల ను ప్రభుత్వం పేద ప్రజలకు అందించనున్నదని, ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకొనే లబ్ధి దారులకు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలకు 48 గంటల్లో జమకానున్నదన్నారు.
ఈ పథకం కింద 2024-25 సంబంధించి మొదటి ఉచిత గ్యాస్ పొందేందుకు మార్చి 31, 2025 వరకు లబ్ధిదారులు నమోదు చేసుకోవచ్చని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రెండవది వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జూలై లోపు బుకింగ్ చేసుకోవాలని, మూడవది ఆగస్టు1 నుండి నవంబర్ 31 లోపు పొందాలని, వెరసి మొత్తం సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తోందని అన్నారు. మన ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడ మండలం రామాపురం నందు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే తన నియోజకవర్గం లోని సమస్యలపై నిరంతరం పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు.
అలాగే గుంతలు లేని రోడ్లు ఉండాలనే లక్ష్యంతో రేపటినుండి ఒక కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుదుతోందని, వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్ర రహదారులు, జిల్లా ముఖ్య రహదారులు గుంతలు లేనివిగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
గ్రామ సమస్యలపై కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో అందుబాటులో ఉన్న ఇసుకను వారి సొంత ఇంటి పనుల నిమిత్తం వాడుకొనడానికి ఎద్దుల బండి, ట్రాక్టర్లతో తీసుకెళ్లడానికి గౌరవ ముఖ్యమంత్రి ప్రజలను ఎలాంటి ఇబ్బంది పెట్టరాదని సూచించారని, అక్రమ రవాణా కి పాల్పడరాదని తెలుపుతూ తిరువల్లూరు ఎస్పీ, కలెక్టర్ తో మాట్లాడి ఆరంబాకం చెక్పోస్ట్ వద్ద ఇసుకను గ్రామస్తులు తమ అవసరాల నిమిత్తం తీసుకెళ్లేందుకు ఏర్పడుతున్న ఆటంకాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలో 350 ఇళ్ళ నిర్మాణాలు ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్న వాటిని ఎంపీడీవో పరిశీలించి వాటి మెరుగుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, సిసి రోడ్లు అవసరాలను తెలిపినచొ వాటిని మంజూరు చేస్తామని, స్మశాన వాటికకు లైటింగ్ ఏర్పాటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూడిరాయి దరువు పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత కార్యక్రమం సాగర మాల పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయని, త్వరలోనే చర్యలు చేపడతామని, ఆంధ్ర బార్డర్ వద్ద ముఖ ద్వారం ఆర్చ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గ్రామాలలో ఆర్వో ప్లాంట్, బార్డర్ పాఠశాలల్లో తమిళ టీచర్ల ఏర్పాటు, అన్నా క్యాంటీన్ ఏర్పాటు, పాఠశాలకు సమీపాన ఉన్న 40 సెంట్లు స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ స్టేషన్ ప్రపోజల్, 13 కుప్పాలకు పూడికతీత అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో సూపర్ సిక్స్ అమలులో భాగంగా దీపం 2 పథకం ప్రభుత్వం అమలు చేస్తోందని సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు మహిళలకు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తూ, పేదలకు అండగా ఉంటూ సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాళ్లలో అమలు చేస్తోందని అన్నారు. తన నియోజకవర్గంలోని ఆరు మండలాలలో 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఒక్కొక్క మండలానికి రెండు కోట్లు చొప్పున కేటాయించబడ్డాయని, రామపురం గ్రామ పంచాయితీలో అభివృద్ధి పనులకు 11 లక్షలు రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. తడ మండలంలో 956 మంది దీపం-2 పథకానికి అర్హులని వివరించారు.
అనంతరం దీపం- 2 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కలెక్టర్ ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు. లబ్ధిదారుల గృహానికి వెళ్లి వారికి గ్యాస్ అందించి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూళ్లూరుపేట కిరణ్మయి, తాసిల్దార్ శరత్ కుమార్ శరత్ కుమార్, ఎంపిడిఓ విజయ్ కుమార్ రామాపురం మండలం సర్పంచ్ కేటి శ్రీను, ప్రజా ప్రతినిధులు, తదితర అధికారులు పాల్గొన్నారు.