-లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
-ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అత్యంత పారదర్శకంగా దీపం-2 పథకం అమలుకు చర్యలు తీసుకున్నామని, లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు.
శుక్రవారం విజయవాడలోని పటమటలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్.. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి దీపావళి కానుకగా మహిళల సేవల్లో దీపం-2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించి, లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారని.. ఈ క్రమంలోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పథకాన్ని ప్రారంభించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లాలో ప్రస్తుతానికి దాదాపు 4.96 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని.. వీరు పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పథకం కింద లబ్ధి పొందేందుకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, ఆధార్ నంబర్, రైస్ కార్డు ఉండాలని, ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి కాలానికి ఒక్కో సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏవైనా సమస్యలుంటే 1967 టోల్‌ఫ్రీ నంబరకు ఫోన్ చేయొచ్చని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధిమీనా సూచించారు.
కూటమి ప్రభుత్వం హయాంలో పేదల జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
కూటమి ప్రభుత్వం హయాంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో సూపర్-6లో భాగంగా వరుసగా పథకాలను అమలుచేస్తున్నట్లు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. దీపం-2 పథకం కింద గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలుచేసేందుకు, ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము జమవుతుందన్నారు. దీపం-2 పథకం అమలుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,684 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గౌరవ ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందించడం జరుగుతోందని, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా అమల్లోకి రానుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు.ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (దీపం-2) అమలు విధానాన్ని విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య లబ్ధిదారులుకు వివరించారు.
పెన్షన్ల పంపిణీలో భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు:
దీపం-2 పథకం ప్రారంభోత్సవం అనంతరం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. డీఆర్‌డీఏ అధికారులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌టీఆర్ భరోసా కింద జిల్లాలో 2,31,961 పెన్షనర్లకు రూ. 97.93 కోట్ల మేర పంపిణీకి సంబంధించిన కార్యక్రమం శుక్రవారం ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కాగా.. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డీవో కె.చైతన్య, డీఎస్‌వో ఎ.పాపారావు, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్, సీహెచ్ ఉషారాణి, హెచ్‌పీ గ్యాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.