విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ సమగ్రత, ఐక్యతకు కృషిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్లో భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురష్కరించుకుని ఏక్తా దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జ్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఐక్యమత్యాన్ని పాటించి మరింత అభివృద్ధి చెంది ప్రపంచంలోనే మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేలా ప్రతీ ఒక్కరూ పాటుపడాలని అన్నారు.
దేశ సమగ్రతను కాపాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. దేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతోందని అన్నారు. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన మన దేశంలో ప్రతీ ఒక్కరూ ముఖ్యంగా యువత ఐకమత్యం పాటించి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానం లో నిలిపేలా సమిష్టిగా పాటుపడాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పలు ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ప్రకటించి గౌరవం కల్పించిందని ఇన్చార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, ఐక్యత, సమగ్రతకు పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిఆర్ఓ వి.శ్రీనివాసరావు రావు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస రెడ్డి, కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News