గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులు పారిశుధ్య పనులు కాకుండా ఇతర విధుల్లో ఉంటే తక్షణం వారిని ఆయా శానిటరీ డివిజన్లలో పారిశుధ్య విధులు కేటాయించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ నాజ్ సెంటర్, నల్లచెరువు మస్టర్ పాయింట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేసి, మాట్లాడుతూ నగరంలో ప్రజారోగ్య కార్మికులు పారిశుధ్య పనులు కాకుండా ఇతర విధుల్లో ఉంటున్నారని, అటువంటి వారిని తక్షణం ఆయా డివిజన్లలో పారిశుధ్య విధులు కేటాయించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకల్లా పర్మినెంట్, ఆప్కాస్ కార్మికుల హాజరు వివరాలను తమకు పంపాలని స్పష్టం చేశారు. కార్మికులు అత్యవసరం అయితే తప్ప ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోకూడదన్నారు. ఉదయం 5:30 గంటలకు తప్పనిసరిగా కార్మికులు, కార్యదర్శులు మస్టర్ కి హాజరు కావాలని ఆదేశించారు. శానిటరీ డివిజన్ల వారీగా గార్బేజ్ ని నూరు శాతం డంపింగ్ యార్డ్ కి తరలించాలని, అవసరమైతే అదనపు ట్రాక్టర్ లను తీసుకోవాలన్నారు.
అనంతరం నల్ల చెరువు రిజర్వాయర్లో త్రాగునీటిలో క్లోరిన్ శ్యాంపిల్ పరిశీలించి, సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి రోజు సరఫరా సమయాల్లో రిజర్వాయర్, సరఫరా జరిగే ఇళ్ల వద్ద శ్యాంపిల్స్ సేకరించాలన్నారు. జిఎంసి రిజర్వాయర్ల నుండి ప్రైవేట్ ట్యాంకర్లకు నీటిని సరఫరా నిలిపివేయాలని ఆదేశించారు.
పర్యటనలో శానిటేషన్ ప్రత్యేక అధికారులు డి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఎస్. ఆయూబ్ ఖాన్, శానిటరీ ఇన్స్పెక్టర్లు అంగడి వెంకటేశ్వరరావు, దాసరి ఏడుకొండలు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …