-గుంతలు లేని రహదారుల ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం చంద్రగిరి ఎం ఎల్ ఏ పులివర్థి నాని
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం రహదారి ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రహదారుల కార్యక్రమానికి “ మిషన్ పాత్ హోల్ ఫ్రీ ఏపీ “ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనీ, అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక చంద్రగిరి నియోజకవర్గంలోని దామల చెరువు దగ్గర నుండి గుంతలు లేని రహదారులను మరమ్మత్తులు చేసే కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లన్నీ బాగు చేసుకునే కార్యక్రమానికి గౌ. ముఖ్యమంత్రి అనకాపల్లిలో ప్రారంభించగా నేడు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి చంద్రగిరి నియోజకవర్గo నుంచి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎన్నికల హామీలో భాగంగా రహదారుల ప్రమాదాలను నివారించే దిశగా గుంతలు లేని రహదారుల మరమ్మత్తులు చేయాలని, రోడ్ల నిర్వహణ పై సరైన శ్రద్ధ లేనీ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ దయనీయ స్థితిలో ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని దృఢనిశ్చయంతో నేడు గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 66 రహదారుల మరమ్మత్తుల పనులను 12 కోట్ల 34 లక్షల తో పనులను మొదలుపెట్టడం జరిగిందని, ఇంకా 55 రకాల మరమ్మత్తుల పనుల కోసం. 95 కోట్లతో పనులను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. కావున జిల్లాలోని అన్ని రహదారుల మరమ్మతుల పనులను యుద్ధ ప్రాతిపదికన నాణ్యతతో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 89 లక్షల 50 వేల రూపాయలతో 87 కిలోమీటర్ల మేర గుంతలు లేని రహదారులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని తెలిపారు.
చంద్రగిరి ఎం.ఎల్.ఏ మాట్లాడుతూ … రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రహదారుల ఏర్పాటు లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఇందులో భాగంగా నేడు మన జిల్లా వ్యాప్తంగా రహదారుల మరమ్మతుల పనులకు శ్రీకారం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషమని అన్నారు. దామల చెరువు కొమ్మిరెడ్డిపల్లి ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉన్నందు వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఏనుగుల బారి నుండి ప్రజలను కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో సెల్ టవర్స్ ఏర్పాటు చేసేలా చూడాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ మధుసూదన రావు, ఆర్ అండ్ డి ఈ శ్రీనివాసులు, జెడ్.పి. టి .సి వంగ పద్మజా రెడ్డి, ఎంపీడీవో శశి రేఖ, తాసిల్దారు నిత్యానంద బాబు, తదితరులు పాల్గొన్నారు.