రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “శాశ్వత లోక్ అదాలత్ ప్రజా ప్రయోజన సేవలు” (PLAPUS) పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PLAPUS చైర్మన్ శ్రీమతి ఏ. గాయత్రి దేవి మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య, వైద్య, తపాలా, టెలీ ఫోన్, బ్యాంకింగ్ వంటి సేవలకు సంబంధించిన సమస్యలను తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) నందు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ తరహా వివాదాలలో కోర్టు ఫీజు లేకుండా రాజీ మార్గం ద్వారా సత్వర పరిష్కారం పొందవచ్చని అన్నారు. దాదాపు కోటి రూపాయల వరకు సమస్యలను, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివాదాలన్ని రాజమహేంద్రవరంలోని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) నందు పరిష్కరింప బడతాయని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు, ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. డిసెంబర్ 14 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడును. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింప బడునని , కావున కక్షిదారులందరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం లో విద్య శాఖ, వైద్య శాఖ, హౌసింగ్ శాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ సరఫరా శాఖ, త్రాగు నీటి సరఫరా శాఖ, పారిశుద్ధ్య శాఖ, తపాలా శాఖ, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి., ఎల్.ఐ.సి, టెలీ ఫోన్, బ్యాంకింగ్,పోస్ట్ ఆఫీసు, వివిధ ఇన్సూరెన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.