Breaking News

సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారులకు చేరే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి…

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారులకు చేరే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు.

శనివారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి లబ్ధిదారుల వరకు చేరవేయడంలో ప్రభుత్వ అధికారులు కలిసికట్టుగా పనిచేసే విజయవంతం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల నుండి వచ్చిన సమస్యల దరఖాస్తులను రికార్డ్ చేసి ఎంతవరకు పరిష్కరించామో ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్ జిల్లాలో స్థిరీకరించే చర్యలను చేపట్టాలన్నారు. ప్రజలకు ఇసుక సౌకర్యవంతంగా అందేలా ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఉచిత ఇసుక ఒక ఆదాయ మార్గంగా చూడకుండా కేవలం రవాణా చార్జీలతో సులభంగా అందేలా చూడాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 22 ఏ భూముల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఎన్ ఆర్ జి ఎస్ మెటీరియల్ కాంపోనెంట్ పెంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. ఆక్వా రంగానికి, గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నా దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా పరిష్కరించాలని సూచించారు. డిమాండు ఎంత ఉంది, సబ్ స్టేషన్ ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గత నాలుగు నెలలుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ వస్తున్నామని పెన్షన్లను పెద్ద ఎత్తున పెంచి అందజేస్తున్నామన్నారు. మహిళలకు ఆసరాగా గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందజేసే కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. అలాగే రోడ్ల మరమ్మత్తులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.800 కోట్ల పైచిలుకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే బాధ్యత అధికారులుదే అన్నారు. ఏ ప్రభుత్వం పాలనలో ఉంటే ఆ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకు వెళ్ళేది అధికారులే అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలుచేయని సంక్షేమ పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి సంబంధించిన కొంతమంది అధికారులకు అవగాహన లేకపోవడం గమనార్హం అని అన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై అవగాహన చేసుకుని చొరవతో పని చేయాలన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు. చిన్న చిన్న విషయాలు కూడా అధికారులు అవగాహన లేక పొరపాట్లు చేయటం జరుగుతుందని ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పని చేయటం అధికారులు బాధ్యతగా గుర్తించాలని కేంద్ర భారీ ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.

రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి, ఇంచార్జీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు. సభ్యులు లేవనెత్తిన అంశాలు, గ్రౌండు లెవిల్ లో సమస్యలను అన్నిటిని ఇన్చార్జి మినిస్టరు దృష్టికి తీసుకు వచ్చామన్నారు. వారి పరిధిలో ఉన్నవి పరిష్కరించి జటిలమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారంకు కృషి చేస్తామన్నారు. ఇసుకను ఒక రూపాయి పెట్టుబడి లేకుండా పారదర్శకంగా నిరుపేదలకు సైతం ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశయం అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురి అయ్యి, ఇసుక లూటీ చేసి భూములను కొల్లగొట్టారని అన్నారు. సుమారు 30 నుండి 40 వేల కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. వారు చేసిన పాపాలు మాకు శాపాలుగా మారాయని, శాపాలను తొలగించుకుని అన్నిటినీ సరి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం సులువుగా ఉచిత ఇసుకను అందించి తీరుతామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటరును ఏర్పాటుకు సియస్ ఆర్ నిధులు మంజూరు చేస్తానని కేంద్రఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారని ఇది ఎంతో శుభపరిణామం అన్నారు. దీనికి సంబంధించిన అంచనాలు, ప్లాన్లు సిద్ధం చేసి త్వరగా నివేదిక రూపంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డయాలసిస్ సెంటరు లేక ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి తదితర దూర ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుందని, ఇందువల్ల పేషెంట్లు వారి బంధువులు నానా ఆగచాట్లు పడుతున్నారని, డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటే ఈ సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి వ్యవస్థను బ్రష్టు పట్టించారని, కాలువలు పూడికలు అంటే వారికి తెలియదని, షట్టర్లు,గేట్లు తదితర మెయింటెన్స్ సంగతి అటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టలేకపోయారన్నారు. దీనివల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు కూడా తీరని అన్యాయం చేశారన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహించి, రైతులు భాగస్వాముతో వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చి వ్యవసాయాన్ని లాభసాటుగా మార్చడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నగరాన్ని మాట్లాడుతూ. ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంలో కొంత సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీటిని అధిగమించి సులువుగా ఇసుక సరఫరాకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ ఉమ్మడి జిల్లాల పరిధిలో పంపకాలు జరిగాయని, ప్రస్తుతం ఇదే విధానం కొనసాగించేందుకు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నారు.

భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు భీమవరం కు డయాలసిస్ సెంటర్ ఏర్పాటుపై మాట్లాడారు. ఉండి శాసనసభ్యులు డ్రైన్ లు, కాలువలు పూడికతీత పనులను నీటి సంఘాలు ఎంపిక అనంతరం వారికి అప్పగించాలని కోరారు. ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ఉచిత ఇసుకను పొందడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి సులువైన మార్గం ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలన్నారు. లో వోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉందని, 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ కు చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల ఇళ్ళ కాలనీలలో సౌకర్యాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎర్ర కాలువ గట్లు తక్షణమే పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రకాలువ పనులు చేపట్టారని తెలిపారు. తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ డయాలసిస్ కేంద్రాన్ని తత్కాలికంగా జిల్లా ఆసుపత్రి నందు ఖాళీగా ఉన్న భవనంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ లో వోల్టేజ్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నామని సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేయాలని కోరారు. కెనాల్స్ ఆధునికరణ లేక 20వేల ఎకరాల వ్యవసాయ సాగు నేడు అయిదు వేలకే పరిమితమైందని తెలిపారు. శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ తణుకులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మిషనరీని అందజేయుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ ఎస్ సి పి సి చైర్మన్ పీతల సుజాత జిల్లాలోని పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఏపియస్ సిపిసి చైర్పర్సన్ పీతల సుజాత, శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు, కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధా కృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాధ్, జిల్లా రెవిన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, కెఆర్సి డిప్యూటీ కలెక్టరు బి. శివనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *