-అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావుతో హోంమంత్రి సమావేశం
-నక్కపల్లిలోని ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై చర్చ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన హోంమంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు.
టీటీడీ ఈవోని కలిసి ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై చర్చ
శ్రీవారి దర్శనం అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశమయ్యారు. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కల్కి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపై హోంమంత్రి చర్చించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 18-11-2015న టీటీడీలో భాగస్వామ్యమైన ఈ ఆలయానికి సంబంధించి స్వామివారి గర్భగుడి, మూలవిరాట్ ను పునరుద్ధరించాలని కోరారు. ప్రాచీన పుణ్యక్షేత్రమే కాకుండా దశావతారాలలో చివరిదశైన శ్రీ కల్కి వేంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చే ఆలయాలలో ఇదే ఏకైక క్షేత్రమని హోంమంత్రి ఆలయ చరిత్రను, ప్రాశస్త్యాన్ని వివరించారు. 2014 ఆగస్టు 9వ తేదీన నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెంకటేశ్వర స్వామి క్షేత్ర దర్శనానంతరం ఆలయ సమస్యలు తెలుసుకుని అభివృద్ధి చేపట్టగా మిగిలిపోయిన పనులను కూడా సత్వరమే పూర్తిచేయాలని ఆమె కోరారు. ముఖమండపం, ఆస్థాన మండపం, రాజగోపురం, నడకదారి, మెట్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే గరుడాద్రి పర్వతంగా పిలిచే కొండ కింద భాగంలోని నారద మహాముని చేతులమీదుగా ప్రతిష్టించిన వేణుగోపాల స్వామి ఆలయంలో కొత్తగా మూడు రాజగోపురాలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ షెడ్డు, కళ్యాణమండపం, రోడ్ల విస్తరణ, అన్నదాన భవనం,గోశాల నిర్వహణ, గోవుల పోషణ, పుష్కరిణిగా భావించే బంధుర సరస్సు, డార్మెటరీ, విశ్రాంతి గదులు,మంచినీటి వసతి, కేశఖండనశాల, పోటు నిర్మాణాలు చేపట్టి శ్రీవారి పారాయణదారులను నియమించి శ్రీకల్కి వేంకటేశుని పురాతన ఆలయానికి పున: వైభవం తీసుకురావాలని హోంమంత్రి అనిత టీటీడీ ఈవో శ్యామలరావుని కోరారు.