-రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకు తొలి అడుగుపడింది. అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూడటం, సెర్ప్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తి వంతంగా పనిచేసేలా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్థేశం చేసారు. సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందనీ పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని మంత్రి సూచించారన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 1995 సంవత్సరంలో డ్వాక్రా సంఘాల వ్యవస్థను ప్రారంభించడం జరిగిందని, 2000 సంవత్సరంలో డిపిఈపి( డిస్టిక్ పావర్టీ ఎవల్యూషన్ ప్రాజెక్ట్) పేరుతో ప్రారంభమై వివిధ మార్పుల అనంతరం సెర్ప్ గా మారిన ఈ శాఖ మరో ఏడాదిలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకొనున్న ఈ తరుణంలో, మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగిందని, ఈ వ్యవస్థను సరియైన గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ సూచించారు.
ఈ సమావేశంలో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శశిభూషన్ కుమార్, సెర్ప్ సి ఇ వో వీరపాండ్యన్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.