-తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలి
-కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేద్దాం
-తక్కువ ధరకే మద్యంతో పాటు.. మద్య నిషేధానికీ కృషి చేయాలి
-ఎక్సైజ్ సిబ్బందితో సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల ఏర్పాటును సహించేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో మద్యం షాపుల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. కొత్త మద్యం పాలసీ అమలు, షాపుల కేటాయింపును పారదర్శకంగా అమలు చేసినందుకు అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 3396 మద్యం షాపుల కేటాయింపులో ఎక్కడా ఎలాంటి వివాదాలకు తావులేకుండా చేయడం సంతోషకరం అన్నారు. గత కొద్ది రోజులుగా మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపుల ఏర్పాటుపై వస్తున్న ఆరోపణలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవలని సూచించారు. బెల్టు షాపుల ఏర్పాటు చేసినట్లు తేలితే ఎంతటివారినైనా ఉపేక్షించొద్దన్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తిస్తే భారీ జరిమానాలతో పాటు కఠినమైన చర్యలు తప్పవని, మాట వినకుంటే షాపు లైసెన్సు కూడా రద్దు చేస్తామనే హెచ్చరిక ప్రతి షాపు నిర్వాహకులకు తెలియజేయాలి. ప్రజారోగ్యం సంక్షేమమే ధ్యేయంగా మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చాం. మద్యం అమ్మకాలలో ఎలాంటి కల్తీని ఉపేక్షించేది లేదని, బెల్టు షాపులను పూర్తిగా కట్టడి చేయాలని సూచించారు. కల్తీ మద్యం నివారించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ప్రాథమిక స్థాయిలో ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌పై ఇప్పటి వరకు 6 పారామీటర్స్ ప్రకారం పరీక్షలు జరుగుతుండగా.. ప్రస్తుతం వాటిని 13కు ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటి వరకు బాటిలింగ్‌కి సిద్ధంగా ఉన్న విస్కీ, బ్రాందీ, వోడ్కా, రమ్‌లో ఆల్కహాల్ శాతాన్ని మాత్రమే పరీక్షిస్తుండగా.. ఇకనుండి తొమ్మిది రకాలుగా పరీక్షించాలని నిర్ణయించాం. ఈ పరీక్షలకు గ్యాస్ క్రోమోటోగ్రఫీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చాం. బి ఐ ఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎక్సైజ్ ల్యాబుల్లో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అధికారుల్ని సూచించారు. ముఖ్యంగా బెల్టు షాపులు, ఎమ్మార్పీ ఉల్లంఘనలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా మార్చేలా చూడాలని అధికారులను సూచించారు. మద్యం వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వీలైనంతగా మద్య వినియోగాన్ని నియంత్రించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను సూచించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ డైరెక్టర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, అడిషనల్ కమిషనర్స్, జాయింట్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూసరింటెండెంట్లు పాల్గొన్నారు