– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సోమవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆ మహనీయుడు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. స్వతంత్ర భారతావనిలో గుణాత్మక విద్యకు ఆజాద్ మార్గదర్శి అని.. విద్యావ్యవస్థ పటిష్టతకు, చిన్నారులలో ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు ఆయన వేసిన అడుగులు మరువలేనివని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆ మహనీయుని సేవలను భావితరాలు స్మరించుచునే రీతిలో ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా 2008లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే ముస్లింల అభ్యున్నతికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని.. మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా అక్షరాల రూ. 25 వేల కోట్ల నగదును డీబీటీ ద్వారా అందజేసినట్లు చెప్పారు. ఆజాద్ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. కనుక మౌలానా అబుల్ కలాం జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆ మహనీయునికి అర్పించే నిజమైన నివాళి అని మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా సుల్తానా, శర్వాణీ మూర్తి, నాయకులు యరగొర్ల రాములు, కుక్కల రమేష్, అక్బర్, పఠాన్ నజీర్ ఖాన్, ఇస్మాయిల్, ఫాతిమా, మైనార్టీ సోదరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.