ప్రకృతి వ్యవసాయం వైపు మరలండి : రైతులకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజ్ఞప్తి


రెడ్డిగుడెం, నేటి పత్రిక ప్రజావార్త :
సేంద్రియ వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ రైతులకు సూచించారు. రైతు చైతన్య యాత్రలలో భాగంగా స్థానిక వ్యవసాయ పరపతి సంఘము కార్యాలయ ఆవరణలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో లాభాలను తెలుసుకుని ప్రతీ రైతు తమ పంటల సాగును ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంటలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు. రసాయనిక ఎరువుల వినియోగం కన్నా సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా కొంత పంట దిగుబడి తగ్గినప్పటికీ అధిక డిమాండ్ కారణంగా ఎక్కువ ధర పలుకుతాయని , సాగు ఖర్చు తగ్గడంతోపాటు, భూసారం కూడా పెంపొందుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ప్రభుత్వం అందించే లబ్దిని ప్రతీ రైతు వినియోగించుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. తాను రైతును కాకపోయినప్పటికీ 20 సెంట్లలలో వరి పంట ను సాగు చేసి ఎన్నో విషయాలను తెల్సుకున్నానన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు చైతన్యవంతులన్నారు. రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, ఉత్తమ యాజమాన్య పద్దతులు తెలియజేయడం , రైతుల అవసరాలను తెలుసుకుని వాటిని అందించి, వారికీ మరింత మెరుగైన సేవలందించడమే రైతు చైతన్య యాత్రల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నదని, కానీ కృష్ణా జిల్లాలో ప్రభుత్వం సబ్సిడీ పై అందించే వారి విత్తనాలపై స్పందన తక్కువగా ఉందన్నారు. ఏ పీ సీడ్స్ ద్వారా బిపిటి 5204, 1067, 1061 ట్రీట్మెంట్ చేసి ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను కిలోకు 5 రూపాయల సబ్సిడీ పై అందిస్తున్నామన్నారు. దీనివల్ల సన్న, చిన్న రైతులకు 500 నుండి 750 రూపాయల వరకు లబ్ది కలగడమే కాక, నాణ్యమైన విత్తనాలు రైతులకు చేరుతాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గత సంవత్సరం 12 వేల క్వింటాళ్ళు వరి విత్తనాలను రైతులకు అందించామని, ఈ సంవత్సరం 24 వేల క్వింటాళ్ళు అందించనున్నామన్నారు. రెడ్డిగూడెం మండలం లో గత సంవత్సరం 310 క్వింటాళ్ళు వరి విత్తనాలు రైతులకు అందించగా, ఈ సంవత్సరం 430 క్వింటాళ్ళు అందుబాటులో ఉంచామని, ఇప్పటివరకు 250 క్వింటాళ్ళు రైతులకు అందించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, తహసీల్దార్ ముత్యాల శ్రీనివాసరావు, ఇంచార్జి ఎంపిడిఓ శంకరరావు, సర్పంచ్ ఎం. రాణీ, వ్యవసాయాధికారి జోగీంద ప్రసాద్, స్థానిక నాయకులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పాడి పశువుల వినియోగార్ధం పాడి రైతులకు కాల్షియమ్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధ్యాప్యపు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా ఒక వృద్ధురాలు జిల్లా కలెక్టర్ కలిసి తన గోడును వెలిబుచ్చుకోగా , వెంటనే వృద్ధ్యాప్యపు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Check Also

ఈనెల 27 వతేదీ కి మండల కమిటీ లు పూర్తి చేయాలి…

-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *