-జిల్లాలో సహకార వారోత్సవాలను విజయవంతం చేద్దాం..
-జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధిమీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, మెరుగైన ప్రపంచ నిర్మాణంలో సహకార సంస్థల పాత్ర కీలకమని, సహకార వారోత్సవాల విజయవంతం సంఘాల బలోపేతానికి దోహదపడుతుందని ఈనెల 14వ తేదీ నుండి నిర్వహించనున్న సహకార వారోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధిమీనా తెలిపారు.
ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న 71వ అఖిల భారత సహకార వారోత్సవాలకు సంబంధించిన ప్రచార గోడ పత్రికను ఇన్‌చార్జ్ జిల్లా కలెక్టర్ డా. నిధిమీనా మంగళవారం నగరంలోని ఆమె ఛాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం డా. నిధి మీనా మాట్లాడుతూ సుస్థర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార సంఘాలు ఎంతో దోహదపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకార్ సే సమృద్ధి యోజన ద్వారా ఇప్పటికే పలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి జన ఔషధి ద్వారా జిల్లాలో ఐదు జనరిక్ మందుల కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. మూడు పెట్రోల్ బంకుల నిర్వహణను సహకార సంఘాలకు అప్పగించడంతో పాటు గిడ్డంగుల నిర్వహణ జరిగిందన్నారు. సహకార సంఘాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు సంబంధించిన డేటాను అన్‌లైన్‌లో పొందపరచడం అభినందనీయమన్నారు. వారోత్సవాలలో భాగంగా 14వ తేదీన సహకార శాఖ ద్వారా అమలు చేసే నూతన కార్యక్రమాల గురించి వివరించడం, 15వ తేదీన నూతన అవిష్కరణలు, సాంకేతికత సుపరిపాలన, 16వ తేదీన వ్యవస్థాపకత, ఉపాధి కల్పన, నైపుణాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర, 17వ తేదీన సహకార సంస్థల వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాంతరం, 18వ తేదీన సహకార సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, 19వ తేదీన మహిళలు, యువత, బలహీనవర్గాలకు సహకారంలో సహకార సంఘాల పాత్ర, 20వ తేదీన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సహకార సంఘాల పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించి సహకార సంఘాల బలోపేతానికి కృషిచేయాలని నిధి మీనా తెలిపారు.
గోడ పత్రికల విడుదల కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి డా. ఎస్ శ్రీనివాసరెడ్డి, జిల్లా కో`ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ సీహెచ్ శైలజ, డివిజనల్ కో`ఆపరేటివ్ అధికారి పి. కిరణ్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్ కేశవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.