-మంత్రి ఎస్.సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన తరగతుల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇటీవల ఏపీ గౌడ వెల్ఫేర్ మరియు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి ఎంపికైన విషయం విధితమే. బుధవారం తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను గౌడ వెల్ఫేర్ మరియు కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుతానని, అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు వెంకట గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల అభివృద్ధే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. బీసీలను అధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. 2024-25 బడ్జెట్ లో రూ.39 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించారన్నారు. జగన్ పాలనలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైందన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను వేరే పథకాలకు దారి మళ్లించి, బీసీలకు జగన్ తీవ్ర ద్రోహం చేశారన్నారు. సీఎం చంద్రబాబు రాకతో మరోసారి బీసీలకు మంచి రోజులు వచ్చాయన్నారు. బీసీలో అన్నికులాలకు మేలు కలిగేలా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారన్నారు. గౌడ సామాజిక వర్గానికి లబ్ధికలిగేలా ఎన్నో పథకాలు అమలు చేయనున్నామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తికి సూచించారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి సవితను గౌడ కార్పొరేషన్ చైర్మన్ వెంకట గురుమూర్తి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.