గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పీకల వాగులో పూడిక లేకుండా, వర్షాకాలం వాగు పొంగి బుడంపాడు పొలాల్లోకి నీరు వెళ్లకుండా తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ గారు పీకల వాగుని జాతీయ రహదారి వెంబడి, బుడంపాడు రైతుల పొలాల వైపు నుండి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీకల వాగుపై ఉండే కల్వర్ట్ ల దగ్గర వారానికి ఒకసారి శుభ్రం చేయాలని ప్రజారోగ్య అధికారులను, కల్వర్ట్ లు మరమత్తులకు గురైన చోట్ల రిపెరులను ఇంజినీరింగ్ అధికారులు చేపట్టాలన్నారు. వాగులో ఎక్కడైనా వ్యర్ధాలు నిలిస్తే జెసిబిల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. బుడంపాడు వద్ద పీకల వాగు పొంగి పొలాల్లోకి నీరు వస్తుందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి, వాగు పొంగకుండా ప్రహరీ నిర్మాణం, పూడిక తీతలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఈఈని ఆదేశించారు.
బుడంపాడులో త్రాగునీటి సరఫరా వాల్వ్ పిట్లు ఆశుభ్రంగా ఉండడం, డ్రైన్ పొంగి నీరు పిట్ లో కలవడం చూసి సదరు వాల్ ఆపరేటర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, 2 రోజుల్లో పిట్ లు షిఫ్ట్ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, త్రాగునీటి కాలుష్యం జరిగే ప్రమాదం ఉండే ఇటువంటి పనులను ఎందుకు పెండింగ్ లో ఉంచుతారు అని ఇంజినీరింగ్ అధికారుల పై అసహనం వ్యక్తం చేశారు. బుడంపాడులోని శ్మశానంకు కాంపౌండ్ వాల్, ఫ్లాట్ ఫారం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు.
అనంతరం జిటి రోడ్ లో చేపట్టిన ప్యాచ్ వర్క్ లను పరిశీలించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలని, నిర్దేశిత గడువు వరకు చేపట్టిన పనులకు కాంట్రాక్టర్ భాధ్యత వహించాలని ఆదేశించారు.
పర్యటనలో ఈఈలు కోటేశ్వరరావు, సుందర్రామిరెడ్డి, డిఈఈలు మధు, సతీష్, రేట్ పెయర్స్ అసోసియేషన్ నారయణ రెడ్డి, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News