మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి ఉత్సవాలను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మచిలీపట్నం మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా వచ్చే భక్తులు స్నానమాచరించేందుకు కావలసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించి సమీక్షించారు.
తొలుత జిల్లా కలెక్టర్ తాగునీటి కౌంటర్లు, తాగునీరు ప్యాకెట్ల మూటలను, వైద్య శిబిరము, అందులో ఉంచిన మందులను, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు వేడి వేడి పాలు అందించే ఏర్పాట్లను, పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు వీలుగా చేతికి వేసే ట్యాగులను, పురుషులు స్త్రీలకు వేరువేరుగా దుస్తులు మార్చుకునే గదులను, మరుగుదొడ్లను, మైకు, ఆహార కౌంటర్లు, హై మాస్ట్ విద్యుత్ దీపాలను, కంట్రోల్ విభాగాలను తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో బీచ్కు తెప్పించిన ఒక ఫాల్కన్ వాహనము, అందులో మానిటర్లు డ్రోన్, ఇతర కెమెరాలతో అనుసంధానమై చుట్టుపక్కల ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం పైన అనుక్షణం పర్యవేక్షణ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బీచ్కు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు
ఈ సందర్భంగా డిఎస్పి అబ్దుల్ సుభాని జిల్లా కలెక్టర్కు వివరిస్తూ 2 ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు జిల్లాకు వచ్చాయని, అందులో 60 మంది సభ్యులు ఉన్నారని, మంగినపూడి బీచ్, పెదపట్నం బీచ్ లో వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు.
వారి వద్ద లైఫ్ జాకెట్లు, లైవ్ బాయ్స్, మెగా ఫోన్లు, లైట్లు అందుబాటులో ఉంటాయన్నారు.ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు వారిని సిద్ధంగా ఉంచుతున్నామని చెప్పారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మచిలీపట్నం ఆర్డిఓ కే స్వాతి, డిపిఓ జే అరుణ, ఆర్టీసీ డిఎం పెద్దిరాజు, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, రహదారులు భవనాల శాఖ ఈఈ లోకేష్,, మత్స్యశాఖ జెడి చంద్రశేఖర్, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, డిఎస్పి అబ్దుల్ సుభాని, మెరైన్ ఎస్ఐ జగదీష్ చంద్రబోస్, ఎంవిఐ శ్రీనివాసు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.