మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల పురోగతి సాధించేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు నిర్దేశించిందని, ఈ అంశం క్రింద చేపట్టిన పనుల పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాలులో జిల్లాలో 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ నూరు శాతం పూర్తయిందని, సి సి ఆర్ సి కార్డులు 70 వేల లక్ష్యానికి గాను, లక్ష్యానికి మించి జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, జిల్లాలో రైతు సేవ కేంద్రాల్లో 302 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా సరిహద్దుల్లో పర్యాటక కేంద్రాల సైన్ బోర్డులు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించుటకు పారిశ్రామిక వేత్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, నూతన క్లస్టర్లు గుర్తించడం చేయాలన్నారు. జిల్లాలో పశు గణన సర్వే కొనసాగుతోందన్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ లక్ష్యాలు సాధించాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం, సూక్ష్మ సేద్య విస్తీర్ణం పెంపునకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు.
జిల్లాలో సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టడం టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేసి పనులు చేపట్టాలని, డిసెంబర్ 15 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గుత్తేదారులు నాసిరకమైన మెటీరియల్ వాడకుండా, నాణ్యమైన మెటీరియల్ వినియోగించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. గృహ నిర్మాణ ప్రగతికి సంబంధించి 1st spell లో లక్ష్యసాధనలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. కొన్నిచోట్ల లేఔట్లలో నీరు నిలిచి నిర్మాణాలు ఆలస్యవుతున్నాయని పురోగతి సాధనకు అవరోధంగా ఉందని హౌసింగ్ అధికారులు కలెక్టర్కు నివేదించగా, 2nd spell లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. నియోజకవర్గల వారిగా గృహ నిర్మాణ ప్రగతి సమీక్షిస్తామన్నారు. జిల్లాలు మద్యం షాపుల లైసెన్సుల జారీ పూర్తయిందన్నారు. బెల్ట్ షాపులు కంట్రోల్ చేయాలన్నారు. త్వరలో జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా, వివిధ శాఖల అధికారులు వారి వారి శాఖల సంబంధించి ప్రగతి నివేదికలు నిర్దేశించిన ప్రొఫార్మాలో సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్వో కె చంద్రశేఖర రావు, జెడ్పి సీఈవో కన్నమ నాయుడు, పరిశ్రమల శాఖ జిఎం వెంకట్రావు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, జిల్లా టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్, డ్వామా పిడి శివప్రసాద్, వ్యవసాయ అనుబంధ శాఖల, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News