-రాష్ట్రంలో సీఆర్ ఫౌండేషన్ సేవలు విస్తరణ
-విజయవాడలో చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తి విజ్ఞాన కేంద్రం
-సీఆర్ ఫౌండేషన్ రజతోత్సవ సభలో వక్తలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ సమైక్యతకోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు అని వక్తలు కొనియాడారు. చండ్ర రాజేశ్వరరావు (సీఆర్) ఫౌండేషన్ రజతోత్సవ సభ స్థానిక గాంధీనగర్‌లోని శ్రీ రామా ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి ప్రసంగిస్తూ పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా అంతా భారతీయులమంటూ దేశ సమైక్యతను తన నడివడిక ద్వారా నిరూపించిన గొప్ప నాయకుడు సీఆర్ అన్నారు. పాకిస్తాన్ యుద్ధం సమయంలో సరిహద్దులో ఉన్న సైన్యం వద్దకు వెళ్లి వారిలో ఉత్తేజాన్ని నింపారని చెప్పారు. విలువలు మరువని దేశభక్తుడు అన్నారు. సీఆర్ రాసింది వీలునామా కాదని విలువలనామా అని కొనియాడారు. ఆనాడు పార్టీల మధ్య చర్చలు మాత్రమే జరిగేవని, ఇప్పటిలా వ్యక్తిత్వ హననం లేదన్నారు. దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు.
సభకు అధ్యక్షత వహించిన సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ విప్లవ ఉద్యమం గుర్తించిన నేత, వామపక్ష ఉద్యమానికి లెజెండరీ సీఆర్ అన్నారు. సీఆర్ కృషితోనే భూమి సమస్యలు జాతీయ స్థాయి అజెండాగా మారాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సేవలను నూతన ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ కేంద్రంగా విస్తరణ చేయనున్నట్లు వెల్లడించారు. కమ్యూనిస్టు ప్రభావం లేకుండా సీఆర్ ఫౌండషన్ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత, గ్రంథాలయం, కళా కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు ధైర్యంగా నిలబడిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా లౌకికవాదానికి దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారని చెప్పారు. సీఆర్ ఫౌండేషన్‌కు సీఆర్‌డీఏ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు త్యాగాలు, నిరాడంబరతను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహాత్మ గాంధీ ఆశయాలను ఆచరించి చూపిన నేత సీఆర్ అన్నారు. దేశం కోసం పాతతరం త్యాగాలు చేసిందని, నేటి తరం దేశాన్ని త్యాగం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చండ్ర రాజేశ్వరరావుతో తనకు, తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, సీఆర్ జీవిత విశేషాలను వివరించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కొందరు చరిత్రను మార్చటానికి జన్మిస్తారని సీఆర్ ఆ కోవకు చెందుతారని చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్యను అభ్యసించి వాటన్నింటినీ కాదని దేశ సమైక్యత కోసం పని చేశారని తెలిపారు. మౌలిక అంశాలపై రాజీపడకుండా ఏకాభిప్రాయంతో పనిచేస్తే స్వాతంత్య్రం నిలుస్తుందన్నారు. నేడు ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను కాలరాస్తూ కార్పోరేట్‌లకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో చండ్ర రాజేశ్వరరావు పేరుతో స్పూర్తి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ సాంఘిక విప్లవ కారుడు, సమసమాజ నిర్మాణం కోసం పరితపించిన నాయకుడు సీఆర్ అన్నారు. సీఆర్ ఫౌండేషన్‌కు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.
ముందుగా చండ్ర రాజేశ్వరరావు చిత్ర పటానికి నేతలు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్ సీఆర్ వీలునామా గీతాన్ని ఆలపించారు. అతిథులకు సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఆర్ ఫౌండేషన్ ఉపాద్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కంభంపాటి అజయ్, కార్యదర్శి పిడికిటి సంధ్యాకుమారి, పీజె చంద్రశేఖరరావు, కోశాధికారి వి.చెన్నకేశవరావు, కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, మానం ఆంజనేయులు, డాక్టర్ రజనీ, జోస్యుల కల్పన తదితరులు పాల్గొన్నారు.